'సత్యం సుందరం' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో లడ్డూపై హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైరయ్యారు. 'లడ్డూ మీద జోక్స్ వేస్తున్నారు. ఓ సినిమా ఈవెంట్‌లో లడ్డూ అనేది సెన్సిటివ్ ఇష్యూ అని ఓ హీరో అన్నారు. మళ్లీ ఇంకోసారి అలా అనొద్దు. యాక్టర్‌గా మీరంటే నాకెంతో గౌరవం. సనాతన ధర్మాన్ని గౌరవించండి. ఏదైనా మాట్లాడేముందు వందసార్లు ఆలోచించండి' అని సూచించారు.
వైసీపీ నేతలు తనపై చేస్తున్న విమర్శలకు ఇప్పటికీ సహిస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. కానీ సనాతన ధర్మంపై అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తిరుమలను ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా మార్చారని, తిరుమల అపవిత్రతకు మాజీ ఈవో ధర్మారెడ్డే ప్రధాన కారణమని అన్నారు. ఇంత జరుగుతున్నా ఆయన ఎక్కడా కనిపించడం లేదన్నారు. వైసీపీ నేతలు పిచ్చి పట్టినట్టుగా మాట్లాడొద్దని పవన్ వ్యాఖ్యానించారు.
అంతకుముందు 'లడ్డూ కావాలా నాయనా' అనే మీమ్‌పై హీరో కార్తీ స్పందిస్తూ.. ఇప్పుడు లడ్డూ గురించి వద్దని, ఆ టాపిక్ చాలా సెన్సిటివ్ అని నవ్వుతూ దానిపై మాట్లాడేందుకు తిరస్కరించారు. తిరుమల లడ్డూ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే తిరుమల లడ్డూను ఉద్దేశంలో పెట్టుకునే కార్తీ ఈ కామెంట్స్ చేసి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.