గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద ఇస్కాన్ సంస్థ ఏర్పాటు చేసిన అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన ఆహారాన్ని ఇక్కడే(అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్‌లో) తయారు చేయనున్నారు. ఇక్కడి నుంచే జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు. కేవలం రెండు గంటల వ్యవధిలో 50 వేల మందికి ఆహారం తయారు చేసే విధంగా భోజనశాలలో ఏర్పాట్లు ఉన్నాయి. రుచి, శుచే లక్ష్యంగా ఆ సంస్థ పాఠశాల విద్యార్థుల కడుపు నింపుతోంది.
రూ.20 కోట్లతో దీన్ని ఏర్పాటు చేశారు. వంటశాలను ప్రారంభించిన అనంతరం విద్యార్థులకు ముఖ్యమంత్రి జగన్ స్వయంగా భోజనం వడ్డించారు. అనంతరం సీఎం కూడా వంటకాలను రుచి చూశారు. విద్యార్థుల కోసం సిద్ధం చేస్తున్న భోజన వివరాలను ఫౌండేషన్ ప్రతినిధులు సీఎంకు వివరించారు. అనంతరం జగన్ కొలనుకొండ వెళ్లారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న గోకుల క్షేత్రానికి భూమి పూజ చేశారు. ఆరున్నర ఎకరాల్లో జాతీయ రహదారి పక్కన కొలనుకొండలో హరేకృష్ణ ప్రాజెక్ట్ సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఇక్కడ రాధాకృష్ణులు, వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించనున్నారు. అలాగే యోగ ధ్యాన కేంద్రాలు, సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించేందుకు కళా క్షేత్రాలు, యువత కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు కానున్నాయి.