సీఎం చంద్రబాబు నాయుడుకు ఊరట
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఊరట లభించింది. ఈ కేసులో
By - అంజి |
సీఎం చంద్రబాబు నాయుడుకు ఊరట
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఊరట లభించింది. ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), తాజాగా దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌లో ఆయన పేరును నిందితుడిగా చేర్చలేదు. నిధుల దుర్వినియోగం, మనీలాండరింగ్ కార్యకలాపాల్లో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు తమ దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని ఈడీ స్పష్టం చేసింది. విశాఖపట్నంలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో ఈడీ ఈ సప్లిమెంటరీ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌ను జనవరి 28న కోర్టు విచారణకు స్వీకరించింది.
డిజైన్‌టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (DTSPL), దాని ఎండీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, సీమెన్స్ ఇండియా మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్ (సుమన్ బోస్) తదితరులను నిందితులుగా పేర్కొన్న ఈడీ, చంద్రబాబు ప్రమేయంపై సాక్ష్యాలు లేవని తేల్చి చెప్పింది. ఈడీ అధికారిక ప్రకటనతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీ సీఐడీ ఈ కేసులో చంద్రబాబుపై ఆరోపణలు "వాస్తవ దోషం (Mistake of Fact)" అని పేర్కొంటూ విజయవాడ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసింది. కోర్టు దానిని ఆమోదించడంతో సీఐడీ కేసు మూసివేతకు గురైంది. ఈ కేసులో ఇతర నిందితులపై పీఎంఎల్‌ఏ కోర్టులో విచారణ కొనసాగనుంది. ఈ కేసులో ఇప్పటివరకు ఈడీ మొత్తం ₹54.74 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.