కోడికత్తి కేసు: ఎన్‌ఐఏ కోర్టులో సీఎం జగన్‌కు బిగ్‌ షాక్‌

సీఎం జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో కత్తితో దాడి ఘటనపై లోతుగా విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఎన్‌ఐఏ కోర్టు కొట్టివేసింది.

By అంజి  Published on  26 July 2023 7:43 AM IST
CM Jagan, knife attack case, AP news, KodiKatti case

 కోడికత్తి కేసు: ఎన్‌ఐఏ కోర్టులో సీఎం జగన్‌కు బిగ్‌ షాక్‌ 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో 2018లో జరిగిన కత్తితో దాడి ఘటనపై లోతుగా విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఎన్‌ఐఏ కోర్టు మంగళవారం కొట్టివేసింది. జగన్ మోహన్ రెడ్డి తరపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు.. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ముఖ్యమంత్రి వేసిన మరో పిటిషన్‌పై విచారణను ఆగస్టు 1వ తేదీకి వాయిదా వేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావడానికి అనుమతించాలని సీఎం జగన్‌ కోర్టును అభ్యర్థించారు. అలాగే నిందితుడు జె.శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్‌ను ఆగస్టు 1వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. నాలుగేళ్లకు పైగా జైలులో ఉన్న నిందితుడిని బెయిల్‌పై విడుదల చేయాలని నిందితుడి తరఫు లాయర్‌ కోరారు. ప్రస్తుతం నిందితుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నాడు.

కత్తి దాడి వెనుక ఎలాంటి కుట్ర లేదని నేషనల్ ఇన్వెస్టిగేషన్ (ఎన్‌ఐఏ) ఏప్రిల్‌లో కోర్టుకు తెలిపింది. జగన్ మోహన్ రెడ్డి పిటిషన్‌పై ఎన్ఐఏ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది, ఈ కేసులో తదుపరి దర్యాప్తును కోరింది. ఎయిర్‌పోర్టు రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్‌కు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని ఏజెన్సీ కోర్టుకు తెలిపింది. అక్టోబరు 25, 2018న విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో జగన్ మోహన్ రెడ్డిపై కోడి కత్తి లేదా కోడిపందాల్లో ఉపయోగించే చిన్న కత్తితో రెస్టారెంటులోని శ్రీనివాస్ రావు అనే కార్మికుడు దాడి చేశాడు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి చేతికి గాయమైంది. ముందుగా జగన్ మోహన్ రెడ్డి హాజరుకావాలని, వాంగ్మూలాన్ని నమోదు చేసుకోవాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది.

అయితే తాను ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించాల్సి ఉందని, కోర్టుకు హాజరుకావడం వల్ల కోర్టు ఆవరణలో ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలకు అసౌకర్యం కలుగుతుందనే కారణంతో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు అడ్వకేట్ కమిషనర్‌ను నియమించాలని కోర్టును అభ్యర్థించారు. దాడి తర్వాత, అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ కేసును రాష్ట్ర పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అప్పగించింది, అయితే రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సంస్థలపై తనకు నమ్మకం లేదంటూ జగన్ మోహన్ రెడ్డి తన వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి నిరాకరించారు. టీడీపీ కుట్ర పన్నిందని అనుమానిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి, ఈ కేసుపై కేంద్ర ఏజెన్సీతో విచారణ జరిపించాలని కోరింది. కోర్టు ఆదేశాల ఆధారంగా, కేంద్రం డిసెంబర్ 31, 2018న కేసును ఎన్‌ఐఏకి అప్పగించింది. ఏజెన్సీ జనవరి 1, 2019న కేసు నమోదు చేసింది.

Next Story