విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఏపీ వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. కేంద్రం తమ నిర్ణయాన్ని ఉప సంహరించుకోకపోతే ఉద్యమాలు చేస్తామంటూ కార్మిక సంఘాలు, పలు రాజకీయ పార్టీలు హెచ్చరికలు పంపుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. స్టీల్ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని జగన్ ప్రధానిని కోరారు. ప్లాంట్‌ను బలోపేతం చేయడానికి మార్గాలను అన్వేషించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రజల పోరాట ఫలితంగా స్టీల్‌ఫ్యాక్టరీ వచ్చిందని వివరించారు. దశాబ్దం పాటు ప్రజలు పోరాటం చేశారని, నాటి ఉద్యమంలో 32మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఉత్పత్తి ఖర్చు విపరీతంగా పెరగడంతో ప్లాంట్‌కు కష్టాలు వచ్చాయని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌కు సొంతంగా గనుల్లేవని ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ఉక్కు పరిశ్రమ ద్వారా 20 వేల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని, పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి పొందుతున్నట్టు లేఖలో తెలిపారు.
2002-15 మధ్య వైజాగ్ స్టీల్ మంచి పనితీరు కనపరిచిందన్నారు. ఈ ప్లాంటు పరిధిలో 19,700 ఎకరాల భూములు ఉన్నాయని వాటి విలువే దాదాపు లక్ష కోట్లు ఉంటుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడటం ద్వారా ప్లాంట్‌ను ప్రగతిబాటలోకి తీసుకెళ్లవచ్చని జగన్ సూచించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 7.3 మిలియన్ టన్నులని.. అయితే 6.3 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్టు గుర్తించారు. గత డిసెంబర్‌లో ప్లాంట్‌కు ఏకంగా 200 కోట్లమేర లాభం కూడా వచ్చిందన్నారు. వచ్చే రెండేళ్లలో ఇలాగే కొనసాగితే ప్లాంట్ ఆర్థికపరిస్థితి మెరుగవుతుందని తెలిపారు.
వైజాగ్ స్టీల్స్‌కు సొంతంగా గనులు కేటాయించడం ద్వారా పోటీ పరిశ్రమలతో సమాన స్థాయికి తీసుకుపోవచ్చని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. వడ్డీ రేట్లు తగ్గిస్తే ప్లాంట్‌పై భారం తగ్గతుందని, బ్యాంకుల రుణాలను వాటా రూపంలోకి మార్చితే ఊరట కలుగుతుందన్నారు.