చంద్రబాబు త్వ‌ర‌గా కోలుకోవాలని సీఎం జగన్ ట్వీట్

CM Jagan Wishes TDP Chief Chandrababu A Speedy Recovery.తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి నారా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Jan 2022 1:47 PM IST
చంద్రబాబు త్వ‌ర‌గా కోలుకోవాలని సీఎం జగన్ ట్వీట్

తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు క‌రోనా నుంచి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని సీఎం జ‌గ‌న్ ఆకాంక్షించారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. కోవిడ్‌ నుంచి త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని సీఎం జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

తనకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింద‌ని, స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని మంగ‌ళ‌వారం ఉద‌యం నారా చంద్ర‌బాబు నాయుడు ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. కరోనా ప‌రీక్ష‌ల్లో తనకు పాజిటివ్ వ‌చ్చింద‌ని తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయ‌ని, అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ హోం క్వారంటైన్‌లో ఉన్న‌ట్లు చెప్పారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారు టెస్టులు చేయించుకోవాల‌ని, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. కుమారుడు నారా లోకేష్‌కు కరోనా సోకిన తర్వాతి రోజే చంద్రబాబుకూ పాజిటివ్ అని తేలింది.

వ్యంగ్యంగా విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌..!

యాదృచ్ఛికమే అయినా ఎన్టీఆర్ వర్ధంతి నాడు చంద్రబాబుకు కరోనా సోకడం బాధాకరమన్నారు. బాబుకు వచ్చిన కరోనా తగ్గిపోతుందిలేగానీ.. టీడీపీ వ్యవస్థాపకుడికి ఆయన పొడిచిన వెన్నుపోటు మాత్రం తెలుగుజాతి ఉన్నంత వరకూ గుర్తుండిపోతుందని ట్వీట్ చేశారు.

ఇక రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్త‌గా 4,108 కరోనా కేసులు న‌మోదు అయ్యాయ‌ని సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,10,388కి చేరింది. క‌రోనా వ‌ల్ల నిన్న ఎవ్వ‌రూ ప్రాణాలు కోల్పోలేదు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,510గా ఉంది. 24 గంటల వ్యవధిలో 696 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,65,696కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,182 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,18,84,914 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

Next Story