తాడిపత్రిలో 500 పడకలతో కొవిడ్ ఆస్పత్రి ప్రారంభం
CM Jagan virtually inaugurate covid hospital.కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దీంతో ఆస్పత్రులన్ని దాదాపు
By తోట వంశీ కుమార్ Published on 4 Jun 2021 9:37 AM GMT
కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఆస్పత్రులన్ని దాదాపు కరోనా రోగులతో నిండిపోతున్నాయి. దీంతో చాలా చోట్ల ప్రజలకు ఆస్పతుల్లో బెడ్లు దొరకడం లేదు. ఐసీయూలు, వెంటిలేటర్ల కొరత వేదిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన 500పడకల సామర్థ్యంతో కూడిన ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చింది. అధునాతన జర్మన్ హ్యాంగర్ టెక్నాలజీలతో ప్రభుత్వం ఈ ఆస్పత్రిని నిర్మించింది. దీంతో ఒకేసారి 500 మంది కరోనారోగులకు అవసరమైన చికిత్స అందజేయడానికి వీలుంది.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏర్పాటు చేసిన ఈ 500 పడకల కొవిడ్ ఆస్పత్రిని సీఎం జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారి తాడిపత్రి సమీపంలోని ఆర్జాస్ స్టీల్ వద్ద జర్మన్ హ్యంగర్ల టెక్నాలజీతో ఆస్పత్రి ఏర్పాటు చేశారు. ఆసుపత్రి నిర్మాణానికి రెండు నెలల గడువున్నప్పటికీ కేవలం 15 రోజుల్లోనే పూర్తి చేయడం విశేషం. ఇక ఈ ఆసుపత్రిలో ప్రతీ బెడ్‌కు ఆక్సిజన్ సరఫరా ఏర్పాటు చేశారు. సుమారు రూ. 5.50 కోట్ల వ్యయంతో 13.56 ఎకరాల్లో ఈ ఆస్పత్రిని నిర్మించారు. అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల ప్రజలకు అనువుగా ఉండేలా తాడిపత్రి లో కోవిడ్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే.. అనంతపరం జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గురువారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం ఈ జిల్లాలో 1,041 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తొమ్మిది మంది మరణించారు.