మైనార్టీలకు పెద్దపీట.. గతానికి, ఇప్పటికి మధ్య తేడా చూడాలి: సీఎం జగన్
మైనార్టీలకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, గతానికి, ఇప్పటికి మధ్య తేడాలను ప్రజలు గమనించాలంటూ సీఎం జగన్ సూచించారు.
By Srikanth Gundamalla Published on 11 Nov 2023 8:45 AM GMTమైనార్టీలకు పెద్దపీట.. గతానికి, ఇప్పటికి మధ్య తేడా చూడాలి: సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ శనివారం విజయవాడలో పర్యటించారు. మైనారిటీస్ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు జగన్. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. మైనార్టీలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పారు. గతానికి, ఇప్పటికి మధ్య తేడాలను ప్రజలు గమనించాలంటూ సీఎం జగన్ సూచించారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్‌ఆర్‌కు దక్కుతుందన్నారు. గత ప్రభుత్వంలో మైనార్టీలను టీడీపీ గాలికొదిలేసిందని ఆరోపించారు. డిప్యూటీ సీఎం హోదాతో మైనార్టీలను ఈ ప్రభుత్వం గౌరవిస్తోందన్నారు సీఎం జగన్.
మైనార్టీల అభ్యున్నతి కోసం అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు ఏపీ సీఎం జగన్. తమ వైఎస్సార్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా మహిళకు అవకాశం కల్పించామని చెప్పారు. గత ప్రభుత్వం మైనార్టీలను అస్సలు పట్టించుకోలేదని విమర్శించారు. 2019 నుంచి మైనార్టీల అభివృద్ధి కోసం తాము ఎన్నో కార్యక్రమాలను అమల్లోకి తెచ్చామన్నారు. సాధికారత మాటల్లో కాదు.. చేతల్లో చూపించామన్నారు. అన్ని రంగాల్లో మైనార్టీల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా సీఎం జగన్ అన్నారు. ముస్లింలలో పేదలందరికి వైఎస్సార్ రిజర్వేషన్‌లు అమలు చేశామన్నారు. గత ప్రభుత్వంలో ఇంత సంక్షేమం జరగలేదన్నారు.
దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను గుర్తుచేసుకున్న సీఎం జగన్.. ఆయన జయంతిని మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో లంచాలు, వివక్షకు తావు లేకుండా పాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది మన బలమని పేర్కొన్నారు. ప్రతి పేదవాడి సంక్షేమం కోసం వైసీపీ ప్రభత్వం పనిచేస్తోందని సీఎం జగన్ అన్నారు.