నేడు వారి ఖాతాల్లో రూ.24 వేలు జ‌మ‌

CM Jagan to Release YSR Nethanna Nestham Scheme funds today.నాలుగో ఏడాది కూడా చేనేత‌ల‌కు వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథ‌కాన్ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Aug 2022 8:10 AM IST
నేడు వారి ఖాతాల్లో రూ.24 వేలు జ‌మ‌

ఎన్ని క‌ష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ పేద‌ల‌ను ఆదుకునేందుకు ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు సీఎం జ‌గ‌న్‌. సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డంలో త‌న‌కు తానే సాటి అని నిరూపించుకుంటున్నారు. వ‌రుస‌గా నాలుగో ఏడాది కూడా చేనేత‌ల‌కు వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథ‌కాన్ని అమ‌లు చేస్తున్నారు. నేడు(గురువారం) కృష్ణా జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. కంప్యూట‌ర్ బ‌ట‌న్ నొక్కి ల‌బ్ధిదారుల ఖాతాల్లోకి సాయాన్ని జ‌మ చేయ‌నున్నారు. వాస్త‌వానికి ఈ నెల 23నే ల‌బ్ధిదారుల ఖాతాల్లో జ‌మ చేయాల్సి ఉన్న‌ప్ప‌టికీ సీఎం ఢిల్లీ ప‌ర్య‌ట‌నతో అది నేటికి వాయిదా ప‌డింది. నాలుగో విడ‌త‌లో రాష్ట్ర‌వ్యాప్తంగా మొత్తం 80,546 మంది నేతన్నల ఖాతాల్లో రూ.193.31 కోట్లు జమ కానుంది.

రాష్ట్రంలో సొంత మ‌గ్గం క‌లిగి, అర్హులైన ప్ర‌తి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24,000 చొప్పున ప్ర‌భుత్వం ఆర్థిక సాయం అంద‌జేస్తోంది. నేడు అందించ‌నున్న సాయంతో క‌లిసి ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తి నేత‌న్న‌కు అందించిన సాయం మొత్తం రూ.96,000 కాగా.. ఈ పథకం ద్వారా నేత‌న్న‌ల‌కు అందించిన మొత్తం సాయం రూ.776.13 కోట్లు.

ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో చేనేత కార్మికులు మగ్గాలను డబుల్‌ జాకార్డ్, జాకార్డ్‌ లిఫ్టింగ్‌ మెషిన్‌ తదితర ఆధునిక పరికరాలతో అప్‌గ్రేడ్‌ చేసుకుని కొత్త డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేయడం వల్ల 2018–19లో కేవలం 4,680 మాత్రమే ఉన్న నెలవారీ ఆదాయం పథకం అమలు తర్వాత మూడు రెట్లు పెరిగి 15,000కు చేరింది అని అంచనా.

ఇక గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.103 కోట్లు సహా రూ.393.30 కోట్లలను ఆప్కోకు అందచేసింది. ఆప్కో వస్త్రాలకు ఆన్‌లైన్‌ ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్‌ కల్పించి నేతన్నల ఆదాయం పెంచేందుకు ఈ–కామర్స్‌ సంస్థలైన అమెజాన్, మింత్ర, ఫ్లిప్‌కార్ట్, గోకూప్, లూమ్‌ఫోక్స్, లాంటి దిగ్గజాలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది.

ఈ పథకం కోసం ఇప్పటికే నేతన్నల నుంచి దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారుల జాబితాలను సచివాలయాలకు పంపించారు. సొంత మగ్గం ఉన్న బిలో పావర్టీ లైన్ కుటుంబాలకు చెందిన వారికి ఈ పథకం కింద ఏటా 24 వేలు రూపాయలు జమ చేస్తున్నారు.

Next Story