గ్రాసిమ్ పరిశ్రమతో 2,500 మందికి ఉద్యోగాలు
CM Jagan to launch Birla Group Caustic Soda unit in Balabhadrapuram.ఏపీ రాష్ట్రంపై నమ్మకం ఉంచి గ్రాసిమ్ పరిశ్రమ
By తోట వంశీ కుమార్ Published on 21 April 2022 3:17 PM ISTఏపీ రాష్ట్రంపై నమ్మకం ఉంచి గ్రాసిమ్ పరిశ్రమ ద్వారా రాష్ట్రంలో రూ.2వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ఆదిత్య బిర్లా సంస్థ ముందుకు రావడం శుభపరిణామమని సీఎం జగన్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో రూ. 2,470కోట్ల తో నెలకొల్పనున్న గ్రాసిమ్ ఇండస్ట్రీ ప్రైవేట్ కంపెనీ యూనిట్‌ను గురువారం ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 75 శాతం స్థానికులకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమ అంగీకరించిందన్నారు.
ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 1,300 మందికి, పరోక్షంగా 1,150 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. గ్రాసిమ్ పరిశ్రమ ఏర్పాటుపై బలభద్రపురం గ్రామస్తులు గతంలో ఆందోళన చెందారని.. కానీ ఈ పరిశ్రమలో టెక్నాలజీలో మార్పు ద్వారా జీరో లిక్విడ్ వేస్ట్ డిశ్చార్జ్ అవుతుందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. కలుషిత వ్యర్థాలు నేరుగా వదలకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. గతంలో గ్రాసిమ్ ప్రాజెక్టు సంబంధించి జరిగిన ఆందోళనల్లో 131 మందిపై కేసులు నమోదయ్యాయని.. ఆందోళనకారులపై ఆ కేసులను ఎత్తివేస్తున్నట్లు చెప్పారు.
గత ప్రభుత్వం ఎన్నికలకు రెండు నెలల ముందు గ్రాసిమ్ సంస్థకు ఈ ప్రాజెక్ట్ అప్పగించిందని, సమస్యలు పరిష్కారం కాకుండా సంతకాలు చేసిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక అన్ని సమస్యలు పరిష్కరించి కంపెనీ పనులు ముందుకు సాగేలా చేశామని సీఎం జగన్ అన్నారు. గ్రాసిమ్ సంస్థ అందించే సీఎస్ఆర్ నిధులు స్థానికంగా ఖర్చుచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అమర్‌నాథ్‌తో పాటు ఇండస్ట్రీకి చెందిన యాజమాన్య సభ్యులు పాల్గొన్నారు.