ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా సాధికారతే లక్ష్యంగా స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం సున్నా వడ్డీకే రుణాలు అందిస్తోంది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇప్పటికే రెండు దఫాల్లో రూ.2,354 కోట్ల వడ్డీని బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించగా.. శుక్రవారం మరో రూ.1,261 కోట్ల వడ్డీని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనుంది. సీఎం జగన్ శుక్రవారం ఒంగోల్‌లో ఒక్క బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు.
తద్వారా 9.76 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,02,16,410 మంది అక్కచెల్లెమ్మలకు లబ్ధి కలుగనుంది. ఈ సొమ్ముతో కలిపి ఇప్పటి దాకా ఈ పథకం కింద రూ.3,615 కోట్లు సాయం అందించినట్లవుతుంది. ఇక సీఎం ఒంగోలు పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం పటిష్ఠమైన ఏర్పాట్లు చేసింది. పట్టణంలోని ఏబీఎం కళాశాల మైదానంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. బహిరంగ సభా వేదిక, డ్వాక్రా మహిళల స్టాల్స్ ను పీవీఆర్ బాలుర పాఠశాల మైదానంలో ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. సీఎం కాన్వాయ్ వచ్చే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.