పశుపోషకుల ఇంటిముంగిటే మూగజీవాలకు మెరుగైన వైద్యసేవలందించే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవలు నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం వద్ద సీఎం జగన్ జెండా ఊపి అంబులెన్స్ వాహనాలను ప్రారంభించారు.
పశువులు అనారోగ్యానికి గురైతే 1962 టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించవచ్చు. ఫోన్ చేసి పశువు అనారోగ్య సమస్య వివరిస్తే.. అంబులెన్స్‌లో రైతు ముంగిటకు వెళ్లి వైద్యసేవలందిస్తారు. ఒకవేళ మెరుగైన వైద్యం కావాల్సి వస్తే దగ్గరిలోని ఏరియా పశు వైద్యశాలకు తరలిస్తారు. మెరుగైన వైద్య సేవలు అందించి తిరిగి ఆ పశువును సురక్షితంగా రైతు ఇంటికి ఉచితంగా చేరవేరుస్తారు.
తొలి విడతలో నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పున కేటాయించనున్నారు. ఇందుకుగానూ రూ.143కోట్లతో 175 పశువుల అంబులెన్స్‌లను కొనుగోలు చేశారు. రెండో దశలో రూ.135 కోట్లతో మరో 165 అంబులెన్స్‌లను కొనుగోలు చేయనున్నారు. ఈ వాహనాల్లో 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు,15 రకాల రక్తపరీక్షలు చేసే ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వీటి నిర్వహణ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది.