రైతులకు మేలు చేసే విషయంలో దేశంతోనే పోటీపడుతున్నాం : సీఎం జగన్
CM Jagan speech in YSR Free Crop Insurance programme Sathya Sai District.రైతన్నలకు మేలు చేసే విషయంలో దేశంతోనే
By తోట వంశీ కుమార్ Published on 14 Jun 2022 9:23 AM GMTరైతన్నలకు మేలు చేసే విషయంలో దేశంతోనే పోటీపడుతున్నామని సీఎం జగన్ అన్నారు. మన రాష్ట్రంలో వ్యవసాయ రంగంలోని మార్పులను చూసి పక్క రాష్ట్రాలు అవలంభిస్తున్నాయని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో జరిగిన కార్యక్రమంలో రైతన్నలకు బీమా పరిహారాన్ని మంగళవారం వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు. 2021 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,977.82 కోట్ల పరిహారాన్ని జమ చేశారు.
అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతుల కోసం తమ ప్రభుత్వం మూడేళ్లలో రూ.1.28లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఇతర రాష్ట్రాల ప్రతినిధులు వచ్చి గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రం(ఆర్‌బీకే)లను పరిశీలించే పరిస్థితులను తీసుకువచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో లంచాలు, వివక్ష లేకుండా అర్హులకు పారదర్శకంగా పథకాలు చేరుతున్నాయన్నారు. ఒకప్పుడు అనంతరపురం జిల్లానుకరువు జిల్లా అనేవారని దేవుడి దయ వల్ల నీళ్లు పుష్కలంగా అందుబాటులోకి వచ్చి అలాంటి పరిస్థితులు మారిపోతున్నాయన్నారు.
ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే రైతులకు బీమా కింద రూ.885 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాలనలో మార్పును గమనించాలని కోరుతున్నామని చెప్పారు. ఇంతకు ముందు బీమా వస్తుందో లేదో తెలియని పరిస్థితి, ఎవరికి వస్తుందో, ఎవరికి రాదో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. ఒక సీజన్‌లో నష్టం జరిగితే.. మళ్లీ మరుసటి ఏడాది అదే సీజన్ రాకముందే నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7లక్షల సాయం అందిస్తున్నామని చెప్పారు.
ఇక కోనసీమలో క్రాప్ హాలిడే పేరుతో రైతుల్ని కొందరు రెచ్చగొడుతున్నారన్నారు. క్రాప్ హాలిడే ఎందుకు.? గతంలో ధాన్యం బకాయిలు ఎగ్గొట్టినందుకా..? ఆ బకాయిలను వైసీపీ ప్రభుత్వం తీర్చినందుకా..? అని ప్రశ్నించారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రైతులకు ధాన్యం సేకరణ డబ్బులు ఇచ్చేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడితే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని, దళిత మంత్రి, బీసీ ఎమ్మెల్యే ఇళ్లను తగలబెట్టారని సీఎం మండిపడ్డారు. సామాజిక న్యాయం చేస్తుంటే వారికి నచ్చడం లేదంటూ పరోక్షంగా విపక్షాలను ఉద్దేశించి అన్నారు. 70శాతం మంత్రి పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారని, సామాజిక న్యాయానికి తాము నిజమైన అర్థం చెబుతున్నామన్నారు.