సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్ దంపతులు
CM Jagan Sankranti Celebrations at Goshala Near Camp Office.ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి నివాసం వద్ద సంక్రాంతి
By తోట వంశీ కుమార్ Published on 14 Jan 2022 1:59 PM ISTఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి నివాసం వద్ద సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి నివాసం దగ్గరలోని గోశాల వద్ద సంప్రదాయబద్ధంగా నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్ దంపతులు, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించారు.
పల్లెవాతావరణం ఉట్టిపడేలా పండుగ ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో చిన్నారులతో సీఎం జగన్ సరదాగా కాసేపు ముచ్చటించారు. గాయకులు మంగ్లీ, ఇంద్రావతి చౌహాన్ సంక్రాంతి పాటలతో ఆకట్టుకున్నారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ అని అన్నారు. రైతులకు మనమంతా ఇచ్చే గౌరవం సంక్రాంతి అని చెప్పారు. సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని కోరుకున్నారు. మంచి జరగాలని మనసారా కోరుకుంటూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలను సీఎం జగన్ తెలిపారు. సంప్రదాయ పంచెకట్టుతో తెలుగుతనం ఉట్టిపడేలా జగన్ వస్త్రధారణ ఉండటం విశేషం.
మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 14, 2022