'జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్ష' పథకంపై సీఎం జగన్ సమీక్ష
CM Jagan review on Jagananna Saswatha Bhu Hakku Bhu Raksha Pathakam.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సమస్యల
By తోట వంశీ కుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్ష పథకంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, సీసీఎల్‌ఏ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, రెవెన్యూశాఖ కమిషనర్ సిద్దార్ధ జైన్ తదితరులు ఈ సమీక్షా సమావేశానికి హాజరైయ్యారు.
సమగ్ర సర్వేకు సంబంధించిన వివరాలను సీఎం జగన్‌కు అధికారులు అందించారు. ఈ సందర్భంగా సమగ్ర భూసర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డ్రోన్‌లను ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. లంచాలకు, అవినీతికి తావులేకుండా సమగ్ర భూ సర్వే జరగాలని, ఈ విషయంలో దేశానికే రాష్ట్రం దిక్సూచిగా నిలవాలన్నారు. వెబ్‌ల్యాండ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కేవలం ఎలక్ట్రానిక్ పద్ధతుల్లోనే కాకుండా, ఫిజికల్ రికార్డులు కూడా తయారుచేయాలన్నారు. ఆ ఫిజికల్ డాక్యుమెంట్‌లను కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సూచించారు. సబ్ డివిజన్‌కోసం దరఖాస్తు పెట్టిన వెంటనే సర్వే జరిగేలా చూడాలన్నారు. సచివాలయాల స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగాలని స్పష్టం చేశారు.
భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా స్థానికంగా ఉన్న సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారం అవుతాయని తెలిపారు. భూ యజమానులకు క్లియర్ టైటిల్స్ ఇచ్చేనాటికి దాదాపుగా వివాదాలు లేకుండా చూడాలన్నారు. న్యాయశాఖను కూడా ఈ ప్రక్రియలో భాగస్వామిగా చేయాలని సూచించారు.