జగనన్న తోడు.. రెండో ఏడాది నిధులు విడుదల
CM Jagan releases jagananna thodu loan amount to beneficiars accounts.కరోనా సంక్షోభంలోనూ జగన్ సర్కార్ ప్రజలకు
By తోట వంశీ కుమార్ Published on 8 Jun 2021 1:43 PM ISTకరోనా సంక్షోభంలోనూ జగన్ సర్కార్ ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూనే వస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా సీఎం హమీలను నెరవేర్చుకుంటూ వస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారు. చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, కూరగాయలు, పండ్లు అమ్ముకొని బతికేవారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు, గంపలు, బుట్టల్లో వస్తువులు అమ్మేవారు, సంప్రదాయ చేతి వృత్తుల వారు, ఏటి కొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీ, ఇత్తడి పనిచేసేవారు ఇలా చిన్న చిన్న వ్యాపారులందర్నీ ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది తెచ్చిన పథకమే.. 'జనగన్న తోడు పథకం'.
గతేడాది నవంబర్ 25న ఈ పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా 5.35 లక్షల మంది లబ్ధిదారులకు సున్నా వడ్డీకే రూ.10 వేల చొప్పున రుణాలను అందించిన సంగతి తెలిసిందే. తాజాగా 'జగనన్న తోడు పథకం' కింద రెండో విడత డబ్బులను విడుదల చేశారు. సీఎం తన క్యాంపు కార్యాలయంలో ఆన్‌లైన్ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.370కోట్ల ఆర్థిక సాయాన్నిఅందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. చిరువ్యాపారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదన్నారు. గత్యంతకం లేక వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు తీసుకుని వారు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. వ్యవస్థలను పేదవాడికి ఉపయోగపడేలా తీసుకురాలేకపోతే ప్రభుత్వాలు ఫెయిల్ అయినట్లేనని సీఎం జగన్ అన్నారు.
రాష్ట్రంలోని 3.7లక్షల మంది లబ్దిదారులకు స్త్రీ నిధి, ఆప్కాబ్, ఇతర బ్యాంకుల నుంచి రూ.10వేల వరకు వడ్డీలేని రుణం అందిస్తున్నట్లు చెప్పారు. అర్హత ఉండి రుణం రాకపోతే ఆందోళన అవసరం లేదని.. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏదైన సహాయం, ఫిర్యాదుల కోసం 1902 నంబరుకు కాల్ చేయొచ్చునని చెప్పారు.