పాద‌యాత్ర‌లోనే చేనేత క‌ష్టాల‌ను చూశా.. అండ‌గా ఉంటాం : సీఎం జ‌గ‌న్‌

CM Jagan released YSR Nethanna nestham funds.త‌న పాద‌యాత్ర‌లోనే చేనేతలు ప‌డుతున్న క‌ష్టాలు చూశాన‌ని, ఇచ్చిన మాట

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Aug 2021 1:27 PM IST
పాద‌యాత్ర‌లోనే చేనేత క‌ష్టాల‌ను చూశా.. అండ‌గా ఉంటాం :  సీఎం జ‌గ‌న్‌

త‌న పాద‌యాత్ర‌లోనే చేనేతలు ప‌డుతున్న క‌ష్టాలు చూశాన‌ని, ఇచ్చిన మాట ప్ర‌కారం చేనేత‌ల‌కు ఆర్థిక సాయం చేస్తున్న‌ట్లు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం వైఎస్సార్‌ నేతన్న నేస్తం' కింద అర్హులైన 80,032 మంది నేతన్నలకు రూ.192.08 కోట్లను తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు సీఎం. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాట్లాడుతూ.. మరో మంచి కార్యక్రమానికి నాంది పలికామని, 'వైఎస్ఆర్ నేతన్న నేస్తం' ద్వారా 80వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు.

ప్ర‌భుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. చేనేత‌ల క‌ష్టాలు తీర్చేందుకే ఆర్థిక సాయం అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు. ఒక్కో చేనేత కుటుంబానికి రూ.24వేల చొప్పున సాయం అందిస్తున్నామ‌ని చెప్పారు. మార్కెట్‌లో నిల‌దొక్కుకునేందుకు ఈ న‌గ‌దు ఉప‌యోగ‌ప‌డాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. అవినీతి, వివక్షకు తావులేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. అర్హత ఉండి జాబితాలో పేర్లు లేని వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ద‌ర‌ఖాస్తు గ‌డువును మ‌రో నెల‌రోజులు పెంచుతామ‌ని.. విచార‌ణ చేప‌ట్టి అర్హులైతే.. వెంట‌నే ల‌బ్ధిచేకూరుస్తామ‌ని తెలిపారు. ఆప్కో ద్వారా ఈ-మార్కెటింగ్‌ తీసుకొచ్చామన్నారు.

మగ్గం కలిగిన, అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. ఐదేళ్లలో ప్రతి లబ్ధిదారుడికి రూ.1,20,000 చొప్పున ఆర్థిక సాయం అందనుంది. ఇప్పటికే 2 విడతల్లో సాయం అందగా తాజాగా మూడో విడత సాయాన్ని అందచేయడం ద్వారా అర్హులైన ప్రతి నేతన్నకు రూ.72,000 చొప్పున ప్రయోజనం చేకూరింది.

Next Story