వైఎస్సార్‌ మత్స్యకార భరోసా.. ఖాతాల్లోకి రూ.10వేలు

CM Jagan released YSR Matsyakara Bharosa Money.'వైఎస్సార్‌ మత్స్యకార భరోసా' పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా అమలుచేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 May 2021 7:34 AM GMT
YSR Matsyakara Bharosa Money

'వైఎస్సార్‌ మత్స్యకార భరోసా' పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా అమలుచేసింది. సముద్రంలో చేపలవేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చే దే ఈ ప‌థ‌కం. సీఎం జ‌గ‌న్ తాడేప‌ల్లిలోని త‌న క్యాంప్ కార్యాల‌యం నుంచి ఆన్‌లైన్ విధానంలో వైఎస్సార్‌ మత్స్యకార భరోసా ప‌థ‌కం నిధులను విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో మ‌త్య్స‌రారుల‌కు అండ‌గా ఉంటామ‌న్న మాట నిల‌బెట్టుకున్నామ‌న్నారు. క‌రోనా సంక్షోభ స‌మ‌యంలోనూ ఈ ప‌థ‌కాన్ని కొన‌సాగిస్తున్నామ‌ని తెలిపారు. 1,19,875 మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భరోసా పథకం అమలు చేస్తున్నాం. అర్హులైన ప్రతి లబ్ధిదారునికీ నేరుగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. గత ప్రభుత్వాల హయాంలో మత్స్యకారులను ఆదుకున్నవారే లేరు. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మత్స్యకారులు చనిపోతే రూ.10 లక్షల చొప్పున ఇస్తున్నామ‌న్నారు.

మ‌త్య్స‌కారుల కోసం 100 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి లీట‌ర్‌కు రూ.9 స‌బ్సిడీ ఇస్తుమ‌న్నామ‌ని చెప్పారు. ఆక్వా సాగు రైతుల‌కు తోడుగా నిల‌బ‌డి ఆర్థిక సాయం అందిస్తున్నామ‌ని చెప్పారు. రాష్ట్రంలో 35 చోట్ల ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్ ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. 8 పిషింగ్ హార్బ‌ర్ల‌ను నిర్మిస్తున్నామ‌ని చెప్పారు. రెండో ద‌శ‌లో మ‌రో నాలుగింటిని ఏర్పాటు చేస్తామ‌న్నారు. వీటి ద్వారా ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా 85 వేల మందికి ఉపాధి దొరుకుతుంద‌ని చెప్పారు.

ఈ పథకం కింద సంతృప్త స్థాయిలో (అర్హత గల వారిని ఒక్కరిని కూడా వదలకుండా) 1,19,875 కుటుంబాలకు రూ.10వేల చొప్పున రూ.119,87,50,000 మేర లబ్ధి కలగనుంది. ఇక గడచిన రెండేళ్లలో మత్స్యకారులకు రూ.211.71 కోట్ల మేర లబ్ధి కలిగింది. ఈ ఏడాది మరో రూ.119.87 కోట్లతో కలిపి మూడేళ్లలో రూ.331.58 కోట్ల మేర లబ్ధి చేకూరుతోంది.




Next Story