చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు శ్రీకారం చుట్టామని సీఎం జగన్ తెలిపారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్ మిల్స్ కు రూ. 1,124 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. పరిశ్రమలు తెచ్చెందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని..పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఎంఎస్‌ఎంఈలకు రూ. 440 కోట్లు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్ మిల్స్‌కు రూ. 684 కోట్లు అందనున్నాయి. దీంతో ఇప్పటి వరకు ఈ రంగాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం ప్రోత్సాహకాలు రూ. 2,086.42 కోట్లకు చేరనున్నాయి. కరోనా విపత్తు వల్ల రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా మూతపడకూడదన్న లక్ష్యంతో గత ఏడాది మే 22న దేశంలోనే తొలిసారిగా రీస్టార్ట్ ప్యాకేజీ పేరుతో రూ.1,100 కోట్ల ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.