ఐదో విడత రైతుభరోసా డబ్బులు విడుదల చేసిన సీఎం జగన్
ఐదో విడత రైతు భరోసా నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు.
By Srikanth Gundamalla Published on 28 Feb 2024 7:10 AM GMTఐదో విడత రైతుభరోసా డబ్బులు విడుదల చేసిన సీఎం జగన్
ఏపీ రైతులకు వైసీపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వరుసగా ఐదో విడత రైతు భరోసా నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. రబీ 2021–22, ఖరీఫ్–2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా చెల్లించారు. ఈ రెండు పథకాల కింద అర్హులైన రైతు కుటుంబాలకు సాయాన్ని బటన్ నొక్కి నిధులను జమ చేశారు సీఎం జగన్.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. ఇప్పటి వరకు రైతు భరోసా కింద 34,288 కోట్ల రూపాయలు చెల్లించామని చెప్పారు. ఈ పథకం ద్వారా 53.58 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని అన్నారు. అంతేకాదు.. గత టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను కూడా తామే చెల్లించామని సీఎం జగన్ చెప్పారు. ఎన్నికల సమయంలో పెట్టుబడి సాయం కింద రూ.12,500 ఇస్తామని చెప్పామనీ.. చెప్పిన విధంగా అధికారంలోకి వచ్చాక పంటపెట్టుబడి సాయం పెంచి ఇచ్చామని అన్నారు. ఇక రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత కరెంటును అందిస్తున్నామనీ సీఎం జగన్ తెలిపారు.
వైసీపీ ప్రభుత్వ వేసిన ప్రతి అడుగు రైతులు, రైతు కూలీలు బాగుపడాలనే వేసిందని జగన్ అన్నారు. క్రమం తప్పకుండా వైఎస్సార్ రైతు భరోసా కింద సాయాన్ని అందించినట్లు చెప్పారు. పెట్టుబడి సాయంగా, రైతన్నకు దన్నుగా ఇది అందించామని సీఎం జగన్ పేర్కొన్నారు. కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూముల సాగు రైతులకు సాయం అందుతుందిన సీఎం జగన్ తెలిపారు. గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలను పెట్టామన్నారు. అగ్రికల్చర్ అసిస్టెంట్‌ను రైతు కోసమే పెట్టామన్నారు. రైతులకు ఇ-క్రాప్ చేస్తూ వారిని అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని సీఎం జగన్ చెప్పారు. విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ కూడా రైతులను చేయిపట్టుకుని నడిపించామన్నారు. మరోవైపు వివాదాలకు చెక్‌పడుతూ సమగ్ర సర్వే చేపట్టామన్నారు. రికార్డులను అప్‌డేట్ చేస్తూ రిజిస్ట్రేషన్ సేవలను గ్రామస్థాయిలో తీసుకు వచ్చామని తెలిపారు. 34.77 లక్షల ఎకరాల మీద పూర్తి హక్కులను రైతులకు, పేదలకు కల్పించామని సీఎం జగన్ వెల్లడించారు.