కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ భేటీ
CM Jagan meeting with Central Minister Nitin Gadkari.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ
By తోట వంశీ కుమార్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజూ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం ఆయన కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర సేపు ఈ భేటీ జరుగగా.. పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, జాతీయ రహదారుల విస్తరణపై చర్చించారు. తీర ప్రాంతం వెంబడి నాలుగు లైన్ల రహదారులు నిర్మాణం చేపట్టాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం జగన్ కోరారు.
విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకు ఏర్పాటు చేయాలనుకున్న జాతీయ రహదారికి సంబంధించిన డీపీఆర్ తయారీ అంశంపై చర్చించారు. విశాఖపట్నానికి ఈ రహదారి చాలా ఉపయోగమని.. ఈ రహదారి నిర్మాణం ద్వారా విశాఖ పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్‌గడ్ వెళ్లే సరుకు రవాణా వాహనాలకు దూరం తగ్గుతుందని కేంద్ర మంత్రికి సీఎం జగన్ వివరించారు. అలాగే.. ఏపీలోని పెండింగ్ ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు మంజూరు చేయాలని సీఎం జగన్ కేంద్రమంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా సీఎం జగన్ భేటీకానున్నారు. ఇక తొలి రోజు పర్యటనలో భాగంగా నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జ్యోతిరాధిత్య సింధియాలను వేర్వేరుగా కలిసిన సీఎం జగన్ రాస్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు.