ఇంటి వద్దకే రేషన్.. డెలివరీ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్
CM Jagan launches Ration door delivery vehicles.ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇంటికే రేషన్ సరుకులు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
By తోట వంశీ కుమార్
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలో భాగంగా మరో పథకానికి శ్రీకారం చుట్టారు. దేశంలోనే తొలిసారిగా ప్రజా పంపిణీ వ్యవస్థలో సరికొత్త విధానానికి తెరతీస్తూ.. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంటికే రేషన్ సరుకులు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఉదయం కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2,500 రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. మిగిలిన జిల్లాలకు కేటాయించిన వాహనాలను మంత్రులు ప్రారంభిస్తారు.
నేడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,260 వాహానాలు ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 1వతేదీ నుంచి నాణ్యమైన రేషన్ బియ్యం డోర్ డెలివరీ కోసం ఈ వాహనాలు సిద్ధమయ్యాయి. లబ్ధిదారులకు నాణ్యమైన, మెరుగుపరచిన బియ్యాన్ని ఇంటివద్దే అందచేసేందుకు ఏటా రూ.830 కోట్లు అదనంగా వెచ్చిస్తూ పథకాన్ని రూపొందించారు. నాణ్యతపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తొలగించి స్వర్ణ రకం బియ్యాన్ని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసింది. ప్రస్తుత ప్రజా పంపిణీ వ్యవస్ధలో అనేక సమస్యలు ఎదురవుతుండటంతో పాటు.. కొద్దిమంది దుకాణదారులు సరుకులను నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
వృద్దులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, రోజువారి కూలీలు రేషన్ సరుకులు తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడుతుండడంతో.. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం మొబైల్ వాహానంలో రేషన్ పంపిణీ విధానానికి శ్రీకారం చుట్టింది. వాలంటీర్ వ్యవస్ధను ఉపయోగించి ప్రజల సమక్షంలో కార్డుదారుల వేలిముద్రల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని, ఖచ్చితమైన తూకంతో తిరిగి ఉపయోగించగలిగే సంచుల ద్వారా పంపిణీ చేస్తారు. మొదటిసారి ఈ సంచులను ఉచితంగా ఇస్తారు. కల్తీకి ఆస్కారం లేకుండా ప్రతీ బియ్యం బస్తాకూ సీల్ ఉంటుంది. ప్రతీ సంచికీ కూడా యూనిక్ కోడ్ ఉండడం వల్ల ఆన్‌లైన్ ట్రాకింగ్ చేయబడుతుంది. మొబైల్ వాహనం నెలకు సగటున 18 రోజుల పాటు కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది.