గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్)- జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వాడ‌లో సీఎం జ‌గ‌న్ ప్రారంభించారు. విజ‌య‌వాడ బెంజి స‌ర్కిల్‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న జ‌గ‌న్‌.. 4,097 చెత్త సేక‌ర‌ణ వాహ‌నాల‌ను జెండా ఊపి ప్రారంభించారు. అంత‌క‌ముందు సీఎం.. గార్చేజ్ టిప్ప‌ర్‌, హై ప్రెజ‌ర్ క్లీన‌ర్ల‌ను ప‌రిశీలించారు. క్లాప్ కార్య‌క్ర‌మ ప్ర‌చార సీడీని ఆవిష్క‌రించారు.

క్లాప్‌ కార్యక్రమంలో భాగంగా.. ఇళ్లలో తడి, పొడి, ప్రమాదకర చెత్తను వేరు చేసేలా ప్రతి ఇంటికి మూడు డస్ట్‌ బిన్‌ల చొప్పున పంపిణీ చేయ‌నున్నారు. 123 కార్పొరేషన్‌లు, మునిసిపాలిటీల్లోని 40 లక్షల గృహాలకు 1.20 కోట్ల డస్ట్‌ బిన్‌లను అందించ‌నున్నారు. ఇందుకోసం రూ.100 కోట్ల నిధులను కేటాయించారు. జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతాలలో 1,500 పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మించనున్నారు. చెత్త సేకరణ, తరలింపు కోసం 3,097 ఆటో టిప్పర్లు, 1,771 ఎలక్ట్రిక్‌ ఆటోలు కూడా ఏర్పాటు చేశారు.

చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలలో ఎక్కువ భాగం సరైన నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. ఈ కేంద్రాల వద్ద నలుగురు చొప్పున సిబ్బందిని నియమించి జీతభత్యాలు, నిర్వహణకు చర్యలు చేపట్టనున్నారు. కొత్తగా 4,171 చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలను నిర్మించనున్నారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story