కోనసీమ వరద ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటన.. బాధితులకు పరామర్శ

CM Jagan is visiting the godavari flood areas in konaseema district. భారీ వర్షాల కారణంగా కోనసీమ జిల్లాలోని సుమారు 51 లంక గ్రామాలు గత కొన్ని రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

By అంజి  Published on  26 July 2022 7:30 AM GMT
కోనసీమ వరద ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటన.. బాధితులకు పరామర్శ

భారీ వర్షాల కారణంగా కోనసీమ జిల్లాలోని సుమారు 51 లంక గ్రామాలు గత కొన్ని రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ముంపుతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే బాధితులను పరామర్శించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ఇవాళ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. వర్షం కురుస్తున్నా.. సీఎం జగన్‌ తన పర్యటన కొనసాగిస్తూ బాధితులకు ధైర్యాన్ని ఇస్తున్నారు. పి.గన్నవరం మండలం పెదపూడిలంకలో వరద బాధితులతో మాట్లాడి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం బూరుగులంక రేవుకు వెళ్లారు. అక్కడ నుంచి పంటులో వశిష్ట గోదావరిని దాటి.. ట్రాక్టర్‌పై వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. పుచ్చకాయలవారి పేటలో వరద బాధితులను సీఎం జగన్‌ పరామర్శించారు. ''పునరావస శిబిరాల్లో బాగా చూసుకున్నారా. కలెక్టర్‌కు ఎన్ని మార్కులు వేయొచ్చు'' అని వరద బాధితులను సీఎం జగన్ అడిగారు. అందుకు సమాధానంగా.. వాలంటీర్లు బాగా పని చేశారని సీఎంకు వరద బాధితులు చెప్పారు.

సీఎం జగన్ అరిగెలవారిపేట, ఉడిమూడిలంక, వాడ్రేవు పల్లిలోని వరద ముంపు బాధితులతో సమావేశం కానున్నారు. వరద ముంపు గ్రామాలను పరిశీలించి.. తాజా పరిస్థితులను అంచనా వేయనున్నారు. ఆ తర్వాత సీఎం జగన్‌ మధ్యాహ్నం 2.05 గంటలకు పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి రాజోలు మండలం మేకలపాలెం చేరుకుని.. వరద బాధితులతో సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం 4.05 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. రాత్రికి రాజమండ్రిలోనే సీఎం జగన్‌ బస చేయనున్నారు.




Next Story