విజయవాడలో వాణిజ్య ఉత్సవ్‌ను ప్రారంభించిన సీఎం జగన్
CM Jagan inaugurates Vanijya Utsav 2021 in Vijayawada.పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాలను
By తోట వంశీ కుమార్ Published on 21 Sep 2021 8:04 AM GMTపారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాలను అందిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఎగుమతుల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలపడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తోన్న వాణిజ్య ఉత్సవ్ 2021 విజయవాడలో సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర ఎగుమతుల రోడ్ మ్యాప్ ను విడుదల చేశారు. ఎక్స్ పోర్ట్స్ కు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన ఈ-పోర్టల్ ను ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ రెండు రోజుల పాటు జరగనుంది.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాలను అందిస్తోందన్నారు. గత రెండేళ్లలో అనేక సవాళ్లు ఎదరైనప్పటికి పారిశ్రామికంగా రాష్ట్రం గణనీయ వృద్ది సాధించిందన్నారు. 2021ఎగుమతుల్లో 19.43 శాతం మేర వృద్ది నమోదు అయినట్లు తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. రెండేళ్లలో రూ. 20, 390 కోట్లతో 10 మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. దీని ద్వారా 55 వేల మందికి ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ. 13 వేల కోట్ల పెట్టుబడితో 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రానికి సహకరించాలని పరిశ్రమ వర్గాలను కోరుతున్నానని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, ప్లాస్టిక్ ఎక్స్ పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది.రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దేశ, విదేశాలకు చెందిన రాయబారులు, పారిశ్రామిక వేత్తలు, ఎగుమతిదారులు, విధాన రూపకర్తలు హాజరుకానున్నారు.