ఓర్వలేకనే ఇలా.. టీడీపీపై సీఎం జగన్ మండిపాటు
CM Jagan Counter to TDP Leaders.రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పాలనను చూసి ఓర్వలేకనే టీడీపీ నేతలు
By తోట వంశీ కుమార్
రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పాలనను చూసి ఓర్వలేకనే టీడీపీ నేతలు దారుణమైన పదజాలంతో విమర్శలు చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. 'జగన్న తోడు' వడ్డి చెల్లింపు కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. కుల, మత, ప్రాంతం, పార్టీలతో నిమిత్తం లేకుండా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. సంక్షేమ పాలనను చూసి టీడీపీ ఓర్వలేకపోతుందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను అలా మాట్లాడలేదన్నారు. టీవీల్లో బూతలు విని భరించలేని అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా స్పందిస్తున్నారన్నారు.
మీ చల్లని దీవెనలతో రెండేళ్లు పాలన అద్భుతంగా సాగిందని.. ఇదే సమయంలో కొంతమంది కావాలని కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని జగన్ ఆరోపించారు. ప్రజలకు ఎలాంటి మేలు జరగకూడదని.. ప్రభుత్వ పథకాలు అమలు కాకూడదని.. అలా జరిగితే ప్రజలకు లబ్ధి చేకూరి.. సీఎం జగన్‌కు మంచి పేరు వస్తుంది.. తమకు మనుగడ ఉండదన్న భయంతోనే.. వాటిని అడ్డుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాదయాత్ర సమయంలో చిరు వ్యాపారుల కష్టాలను కళ్లారా చూశానని.. వారికి ఇప్పుడు 'జగనన్న తోడు' పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరికీ ఏటా రూ.10 వేల వడ్డీలేని రుణం అందిస్తున్నామని చెప్పారు. 9.05 లక్షల మందికి రూ.905 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి వడ్డిని విడుదల చేస్తున్నామన్నారు. ఏడాదికి రెండు సార్లు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు.