భారీ వర్షాలపై కలెక్టర్లకు సీఎం జగన్ కీలక ఆదేశాలు

ఏపీలో భారీ వర్షాలపై కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

By Srikanth Gundamalla  Published on  28 July 2023 12:57 PM GMT
CM Jagan, Conference,  Collectors, Heavy Rains,

భారీ వర్షాలపై కలెక్టర్లకు సీఎం జగన్ కీలక ఆదేశాలు

ఏపీలో భారీ వర్షాలపై కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పునరావాస ఏర్పాట్లు సమర్ధవంతంగా నిర్వహించాలని చెప్పారు. ఏదో చేస్తున్నాం అని కాకుండా.. మానవీయకోణంలో సహాయం అందించాలని సూచించారు. కలెక్టర్లు మాకు మంచి చేశారు అని వరద బాధితులు చెప్పేలా ఉండాలని అన్నారు సీఎం జగన్. అయితే.. లోతట్టు ప్రాంతాల ప్రజరలు ఇప్పటికే ఖాళీ చేశారు. అవసరం అనుకుంటే పరిస్థితులను మిగతా చోట్ల కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని జగన్ కలెక్టర్లకు చెప్పారు. సహాయక శిబిరాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పారు.

ఇక సహాయక శిబిరాల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్నప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2వేలు ఇవ్వాలన్నారు సీఎం జగన్. వ్యక్తులైతే రూ.వెయ్యి ఇవ్వాలన్నారు. కచ్చా ఇళ్ల విషయంలో కలెక్టర్లు మానవీయ దృక్పథంతో ఉండాలని, ఆయా ఇళ్ల నుంచి సహాయ శిబిరాలకు వచ్చిన వారిని తిరిగి పంపించేటప్పుడు వారికి రూ.10 వేల రూపాయలు ఇవ్వాలని చెప్పారు. తిరిగి కచ్చా ఇంటిని నిర్మించుకోవడానికి వారికి ఉపయోగపడుతుందని సీఎం జగన్ అన్నారు. రూ.10వేలు ఇవ్వడం ద్వారా తిరిగి కచ్చా ఇంటికి మరమ్మతులు చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. వరద నీరు ప్రవహించిన ఇళ్లు ఉన్న ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని అన్నారు. 25 కిలోల బియ్యం, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళదుంపలు, కేజీ పామాయిల్, కేజీ కందిపప్పు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా అందుబాటులో ఉండాలని సూచించారు. కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలని చెప్పారు. సచివాలయ సిబ్బందిని, వాలంటీర్ల సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని కలెక్టర్లకు సీఎం జగన్ సూచించారు. ఆరోగ్య శిబిరాలు, మంచినీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. అలాగే మెడిసిన్స్‌ను అన్నీ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ఈ విషయాలన్నింటిపైనా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటూ.. ప్రజలకు అండగా నిలవాలని సీఎం జగన్ చెప్పారు. ఇక రైతులకు కూడా బాసటగా నిలవాలన్నారు సీఎం జగన్.

Next Story