చంద్రబాబు స్టార్‌ క్యాంపెయినరే.. షర్మిలపై సీఎం జగన్ పరోక్ష విమర్శలు

సీఎం జగన్‌ కూడా షర్మిల వ్యవహారంపై పరోక్షంగా విమర్శలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  23 Jan 2024 4:20 PM IST
CM Jagan, chandrababu, pawan, sharmila,

చంద్రబాబు స్టార్‌ క్యాంపెయినరే.. షర్మిలపై సీఎం జగన్ పరోక్ష విమర్శలు

వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌లో చేరి.. ఏపీసీసీ పగ్గాలను తీసుకుంది. వెంటనే రంగంలోకి కూడా దిగింది. ఆదివారం ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన షర్మిల ఇటు టీడీపీ.. అటు వైసీపీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన అన్న జగన్‌పై కూడా పలు కామెంట్స్ చేసింది. ఆ తర్వాత వైసీపీ నేతలు షర్మిల తీరును వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా సీఎం జగన్‌ కూడా షర్మిల వ్యవహారంపై పరోక్షంగా విమర్శలు చేశారు.

మంగళవారం ఉరవకొండలో వైఎస్సార్‌ ఆసరా నిధుల జమ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిపక్షాల రాజకీయాలపై మండిపడ్డారు. ఏనాడూ మంచి చేయని చరిత్ర చంద్రబాబుది అంటూ ఫైర్ అయ్యారు. అలాంటి వ్యక్తికి పక్క పార్టీల్లో కూడా స్టార్‌ క్యాంపెయినర్లు ఉన్నారని చెప్పారు. మంచిని నమ్ముకున్న తనకు అలాంటి వారి అవసరం లేదన్నారు ఏపీ సీఎం జగన్. చంద్రబాబుని భుజాన ఎత్తుకుని మోసే ముఠా చాలా మంది ఉన్నారని అన్నారు. అయితే.. వారెవరూ ఆంధ్రప్రదేశ్‌లో ఉండేవారు కాదనీ.. ఇళ్లు, కాపురాలు, సంసారాలు పక్కరాష్ట్రంలో ఉంటాయని చెప్పారు. చంద్రబాబు దత్తపుత్రుడు స్టార్‌ క్యాంపెయినర్‌ అయితే.. చంద్రబాబు వదినగారు ఆమె పక్కపార్టీలోకి వెళ్లి అక్కడి నుంచి చంద్రబాబుకి మరో స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేస్తున్నారని అన్నారు.

వీరుకాక రాష్ట్రాన్ని విడగొట్టి పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం కూడా చంద్రబాబుని జాకీపెట్టి ఎత్తేందుకు కష్టపడుతున్నారని పరోక్షంగా షర్మిలపై కామెంట్స్ చేశారు సీఎం జగన్. ఇలా స్టార్‌ క్యాంపెయినర్లు చాలా మంది చంద్రబాబుకి తోడుగా.. ఆయన కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. కానీ.. తనకు ఇలాంటి స్టార్‌ క్యాంపెయినర్ల అవసరం లేదని చెప్పారు. పార్టీ జెండాలను కట్టిన వారంతా తన స్టార్‌ క్యాంపెయినర్లే అని జగన్ అన్నారు. ప్రజలకు మంచి చేయడం... జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ అజెండా అని చెప్పుకొచ్చారు.

Next Story