ఎయిడెడ్ కు వ్యతిరేకం కాదు : సీఎం జ‌గ‌న్

CM Jagan carified aided Educational.రాష్ట్రంలోని ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు ప్రభుత్వం వ్య‌తిరేకం కాద‌ని సీఎం జ‌గ‌న్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Nov 2021 5:46 AM GMT
ఎయిడెడ్ కు వ్యతిరేకం కాదు : సీఎం జ‌గ‌న్

రాష్ట్రంలోని ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు ప్రభుత్వం వ్య‌తిరేకం కాద‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు. ప్ర‌భుత్వంలో విలీనానికి స‌మ్మ‌తి తెలిపిన ఎయిడెడ్ విద్యాసంస్థ‌లు కావాలనుకుంటే.. ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవ‌చ్చున‌ని చెప్పారు. వాటిని యాజ‌మాన్యాలు య‌థాత‌థంగా నిర్వ‌హించుకునేందుకు ప్ర‌భుత్వం అవ‌కాశం క‌ల్పిస్తుంద‌ని..ఎయిడెడ్ స్కూళ్ల అధ్యాప‌కులు, విద్యార్థుల‌కు మంచి చేయాల‌నే ఉద్దేశ్యంతోనే వాటిని విలీనం చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. సీఎం క్యాంపు కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం అధికారుతో జ‌రిగిన స‌మావేశంలో సీఎం జ‌గ‌న్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకమనే కోణంలో జరుగుతున్న ప్రచారాలు, కథనాలను అధికారులు సీఎం దృష్టికి తీసుకువ‌చ్చారు. దీనిపై సీఎం మాట్లాడుతూ.. ఎయిడెడ్‌ విద్యాసంస్థల చుట్టూ జరుగుతున్న రాజకీయాలు, రెచ్చగొట్టే ధోరణులు బాధాకరమన్నారు. ఇందులోకి రాజకీయాలను తీసుకురావడం దురదృష్టకరమని చెప్పారు. ఎయిడెడ్ విద్యాసంస్థ‌ల యాజ‌మాన్యాలు అందులో ప‌నిచేస్తున్న టీచ‌ర్లు, విద్యార్థుల‌కు మంచి చేయాల‌నే ఉద్దేశ్యంతో కొన్ని అవ‌కాశాల‌ను క‌ల్పించామ‌ని వివ‌రించారు.

గతంలో డబ్బున్న వారు, ఆస్థిపాస్తులు ఉన్నవారు ఛారిటీ కింద భవనాలు నిర్మించారు. అందులో ఎయిడెడ్‌ పాఠశాలలు, కాలేజీలు పెట్టారు. తర్వాత కాలంలో ఈ స్కూళ్లు, కాలేజీలు నడపడం ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారిందన్నారు. యాజ‌మాన్యంలోని వ్య‌క్తులు ఈ విద్యాసంస్థ‌లు న‌డిపేందుకు స‌మ‌యం కేటాయించ‌లేక‌పోతున్నార‌న్నారు. సంస్థ వ్యవహారాలను దగ్గరుండి చూసుకునే పరిస్థితులు లేకుండా పోయాయని తెలిపారు. ఈ కారణాలన్నీ కూడా ఎయిడెడ్‌ సూళ్లు, కాలేజీల నిర్వీర్యానికి దారితీశాయని చెప్పుకొచ్చారు. ఎయిడెడ్‌ స్కూళ్లన్నీ కూడా శిథిలావస్థకు చేరాయి. రిటైరైన టీచర్ల స్థానే కొత్త వారిని నియమించుకోవడం కూడా యాజమాన్యాలకు ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారిందని.. ఒకవేళ టీచర్లను పెట్టినా నాణ్యత లోపించిందన్నారు.

ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు కూడా తమను ప్రభుత్వంలో భాగంగా గుర్తించాలని చాలాకాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని సీఎం జ‌గ‌న్ వివ‌రించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్‌ విద్యాసంస్థల వెనకున్న ఉద్దేశాల రక్షణకు, వాటి యాజమాన్యాలకు సహాయకారిగా ప్రభుత్వం ఐచ్ఛికంతో కూడిన విధంగా.. స్వచ్ఛందంగా కొన్ని అవకాశాలను కల్పించిందన్నారు. నడపలేని పరిస్థితుల్లో ఉన్న విద్యా సంస్థలను ఉన్నది ఉన్నట్లుగా ప్రభుత్వానికి అప్పగిస్తే.. నాడు–నేడులో భాగంగా పునరుద్ధరిస్తామ‌న్నారు. విద్యార్థులకు సరిపడా టీచర్లను భర్తీచేస్తామ‌ని.. చారిటీ కింద విద్యాసంస్థలను పెట్టిన దాతల పేర్లను కొనసాగించడం ద్వారా యాజమాన్యాల ఉద్దేశాలను నెరవేరుస్తామ‌ని చెప్పారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలు ఐచ్ఛికంగానే ఈ అవకాశాలను వినియోగించుకోవచ్చున‌ని.. ఇందులో ఎలాంటి బలవంతంలేదని సీఎం జ‌గ‌న్ చెప్పారు.

Next Story