ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఇందులో నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా వ్యాప్తి వల్ల రెండు రోజులకే కుదించి ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. దిశ చట్టం సవరణ ముసాయిదా బిల్లుతో పాటు పలు బిల్లులను అసెంబ్లీ అజెండాలో చేర్చాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తక్కువ సమయంలో సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
నివర్ తుఫాన్ ఐదు జిల్లాలను అతలాకుతలం చేస్తుండగా.. ఆ తుఫాన్ ప్రభావాన్ని కేబినెట్‌కు వివరించనున్నారు అధికారులు. కేబినెట్ భేటీలో.. ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణం పథకాలపై చర్చించనుండగా.. ఉద్యోగులకు దశల వారీగా డీఏ బకాయిల చెల్లింపులకు ఆమోదముద్ర వేయనున్నారు. ఉచిత పంటల బీమా పథకం అమలుపై కూడా చర్చ సాగనుంది. వచ్చే నెల 2వ తేదీ నుంచి అమూల్ ప్రాజెక్టుపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర, పల్నాడు ప్రాంతాల్లో కరవు నివారణ చర్యలు.. దానికోసం రూపొందించాల్సిన ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు.