ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వద్దు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎక్కడా నిర్లక్ష్యం వహించవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

By -  అంజి
Published on : 25 Feb 2026 12:40 PM IST

CM Chandrababu Health Review, Srikakulam Diarrhea Outbreak, Rajahmundry Adulterated Milk Case, AP Public Health Safety

ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వద్దు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

అమరావతి: రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎక్కడా నిర్లక్ష్యం వహించవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇటీవల రాజమహేంద్రవరంలో చోటుచేసుకున్న కల్తీ పాల ఘటన, శ్రీకాకుళంలో వ్యాపించిన డయేరియా అంశాలపై ఆయన ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళంలో డయేరియా బారిన పడి ప్రస్తుతం 76 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు సీఎంకు వివరించారు.

ముఖ్యంగా జెమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితుల పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. వారిలో ఒకరికి వెంటిలేటర్‌పై, మరొకరికి డయాలసిస్ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరిద్దరు మినహా మిగిలిన వారంతా నిలకడగా ఉన్నారని చెప్పారు. వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరాను నిలిపివేసి, ట్యాంకర్ల ద్వారా సురక్షితమైన తాగునీటిని అందిస్తున్నట్లు వెల్లడించారు. రాజమహేంద్రవరం ఘటనలో బాధితులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు.

పాలకు సంబంధించిన శాంపిళ్లను ల్యాబ్‌కు పంపించామని, నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండాలని సీఎం సూచించారు. విచారణలో ఎవరి తప్పు ఉన్నా ఉపేక్షించవద్దని, బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Next Story