గుడ్లవల్లేరు కాలేజ్‌ ఘటన.. ఎస్‌ఐ తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

ఏపీలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో రహస్య కెమెరాల ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  1 Sept 2024 11:00 AM IST
గుడ్లవల్లేరు కాలేజ్‌ ఘటన.. ఎస్‌ఐ తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

ఏపీలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో రహస్య కెమెరాల ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. విద్యార్థినుల హాస్టల్‌లో రహస్య కెమెరాలను అమర్చి వీడియోలు చిత్రీకరించారని ఆరోపించారు. అమ్మాయిలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ సంఘటనపై విచారణ కొనసాగుతోంది. విచారణను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ లతో మాట్లాడి విచారణపై సమీక్ష చేస్తున్నారు. ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా సిఐ రమణమ్మను ఎస్పీ నియమించారు. ఆమె నేతృత్వంలో విచారణ జరుగుతుండగా....బందోబస్తు కోసం పలు ప్రాంతాల నుంచి మహిళా పోలీసు అధికారులను, సిబ్బందిని నియమించారు.

ఈ సమయంలో కోడూరు ఎస్ఐ శిరీష విద్యార్ధినులతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో వెలుగు చూసింది. ఆ పోలీసు అధికారి తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధలో, ఆందోళనలో ఉన్న విద్యార్థినులతో అధికారులు దురుసుగా ప్రవర్తించడం మంచిదికాదని అన్నారు. ఇలాంటి పోకడలను సహించేదిలేదన్నారు. ఘటనపై పోలీసు ఉన్నతాధికారలు నుంచి వివరణ కోరారు. దర్యాప్తు బృందంలో ఎస్ఐ శిరీష లేరని...బందోబస్తు కోసం పిలిపించామని అధికారులు వివరించారు. ఆమెను ఆ ప్రాంతంలో బందోబస్తు విధుల నుంచి ఇప్పటికే తప్పించామని తెలిపారు. కోడూరు ఎస్ఐ గా ఉన్న శిరీషను విఆర్ కు పంపుతున్నట్లు ఉన్నతాధికారులు.. సీఎం చంద్రబాబుకు తెలిపారు. స్టూడెంట్స్ ఆవేదనను అర్థం చేసుకుని...వారికి భరోసా ఇచ్చేలా అధికారులు వ్యవహరించాలని ఈ మేరకు సీఎం చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులను సూచించారు.

Next Story