మహిళా దినోత్సవం వేళ.. అంగన్వాడీలకు గ్రాట్యుటీ పెంపు!
అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు గుడ్‌న్యూస్. వారి గ్రాట్యుటీ పెంపుపైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి
మహిళా దినోత్సవం వేళ.. అంగన్వాడీలకు గ్రాట్యుటీ పెంపు!
అమరావతి: అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు గుడ్‌న్యూస్. వారి గ్రాట్యుటీ పెంపుపైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ముందు ఇచ్చిన గ్రాట్యుటీ పెంపు హామీని మహిళా దినోత్సవం సందర్భంగా నెరవేర్చనుంది. అంగన్వాడీ కార్యకర్తలకు రూ.1.79 లక్షల నుంచి రూ.2.32 లక్షలు వరకు వారి సర్వీసు ఆధారంగా అందనుంది. అంగన్వాడీ ఆయాలకు రూ.1.09 లక్షల నుంచి 1.41 లక్షల వరకు గ్రాట్యుటీ అందిస్తారు. దీని ద్వారా ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.17.73 కోట్ల భారం పడనుంది.
అంగన్వాడీల గ్రాట్యుటీ పెంపుపై ఇవాళ సీఎం చంద్రబాబు ప్రకటన చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 55,607 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 1,04,516 మంది అంగన్వాడీ కార్యకర్తలు(55,607), ఆయాలు(48,909) పనిచేస్తున్నారు. వీరిలో ఏటా పదవీ విరమణ అయ్యేఏ వారికి లేదా రాజీనామా చేసేవారికి చెల్లించే గ్రాట్యుటీ రూ.17,73,43,218 కోట్లుగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2025-26 బడ్జెట్‌లో రూ.20 కోట్లు కేటాయించింది. ప్రతి ఏటా 1,218 మందికి పైగా కార్యకర్తలు, ఆయాలు పదవీ విరమణ పొందుతున్నారని అధికారులు చెబుతున్నారు.
గ్రాట్యుటీ అమలు విషయంలో ఉద్యోగి ఎన్ని సంవత్సరాలు సర్వీసులో ఉంటే అన్ని సంవత్సరాలు సంవత్సరానికి 15 రోజుల వేతనం చొప్పున లెక్కిస్తారు. అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్లను ఉద్యోగంలోకి తీసుకోవడానికి గరిష్ఠ వయసు 35 సంవత్సరాలు. పదవీ విరమణ వయసు 62 ఏళ్లు. అంటే గరిష్ఠ వయసు నుంచి పదవీ విరమణ వయసు వరకు 27 సంవత్సరాలు అంగన్వాడీల్లో వారు పనిచేస్తారు. అంగన్వాడీ కార్యకర్తలకు వేతనం రూ.11,500. అంగన్వాడీ కార్యకర్త ఎన్ని సంవత్సరాలు సర్వీసులో ఉంటే అన్ని సంవత్సరాలు సంవత్సరానికి 15 రోజుల వేతనం చొప్పున గ్రాట్యుటీ ఇస్తారు.