తిరుమలలో అత్యాధునిక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్.. ప్రారంభించిన సీఎం చంద్రబాబు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదాలు, అన్నప్రసాదాల నాణ్యతలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
By - అంజి |
తిరుమలలో అత్యాధునిక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్.. ప్రారంభించిన సీఎం చంద్రబాబు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదాలు, అన్నప్రసాదాల నాణ్యతలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తిరుమలలో అత్యాధునిక FSSAI (భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ) ల్యాబొరేటరీని ప్రారంభించారు. సుమారు 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, కేంద్ర ప్రభుత్వ నిధులతో కేవలం 9 నెలల రికార్డు సమయంలో ఈ ల్యాబ్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, ఇతర బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ ల్యాబొరేటరీలో నీరు, ఆహార పదార్థాలు, ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడి సరుకుల నాణ్యతను అత్యంత ఖచ్చితత్వంతో పరీక్షిస్తారు. ప్రస్తుతం ఈ ల్యాబ్‌లో మొత్తం 50 రకాల అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, ఆహార విశ్లేషణలో మరింత మెరుగైన ఫలితాల కోసం త్వరలోనే ఫ్రాన్స్ దేశం నుండి సుమారు రూ. 3 కోట్ల విలువైన హై-టెక్ మెషీన్లను కూడా తెప్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ల్యాబ్ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి అక్కడి సౌకర్యాలను పరిశీలించి, ఆహార భద్రతా నిపుణులతో చర్చించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదాల తయారీలో ఏమాత్రం నాణ్యత తగ్గకూడదని, కల్తీని అరికట్టేందుకు నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. భక్తులకు అందించే ఆహారం అత్యున్నత ప్రమాణాలతో ఉండాలని, ఈ ల్యాబ్ ద్వారా ముడి సరుకుల నాణ్యతను ఎప్పటికప్పుడు ధ్రువీకరించుకోవాలని ఆయన సూచించారు. తిరుమల పవిత్రతను కాపాడటంలో ఆహార నాణ్యత కీలక పాత్ర పోషిస్తుందని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.