అమరావతి: రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉప సంఘంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్... సబ్ కమిటీలోని మంత్రులు అనగాని, నారాయణ, నాదెండ్ల, సత్యకుమార్, అనిత, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్థన్ రెడ్డి హాజరయ్యారు. ప్రజల అవసరాలు, పాలనా సౌలభ్యం ప్రధాన అజెండాగా జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అంశంపై ప్రభుత్వం ఆలోచనలు, చర్చించారు.
గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగిందని మంత్రి వర్గ ఉప సంఘం అభిప్రాయపడింది. గత ప్రభుత్వ నిర్ణయం కారణంగా పలు చోట్ల ప్రజలకు ఇబ్బందులు, పరిపాలనలోనూ సమస్యలు వచ్చాయని తెలిపింది. అయితే గతంలో జరిగిన జిల్లా పునర్ వ్యవస్థీకరణ వల్ల తలెత్తిన ఇబ్బందులను సరిదిద్దే పనిలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలిపింది.
జిల్లాల పునర్ విభజన, మార్పులు చేర్పులు, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ఈ ఏడాది జూలైలో రాష్ట్ర ప్రభుత్వం ఏడుగురు మంత్రులతో ఉప సంఘం ఏర్పాటు చేసింది. పలుమార్లు సమావేశమై వివిధ వర్గాలు, ప్రజాసంఘాల నుంచి వచ్చిన వినతులను కేబినెట్ సబ్ కమిటీ పరిగణనలోకి తీసుకుంది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సమాలోచన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అందిన అర్జీలు, ప్రజల అవసరాలు, సౌకర్యం, ఎన్నికల సమయంలో హామీలపైనా మంత్రివర్గ ఉపసంఘంతో సీఎం చంద్రబాబు చర్చించారు.