దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తిరంగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ''ప్రపంచ దేశాలలో అన్ని విధాలా బలమైన శక్తిగా భారతదేశం ఎదుగుతున్న తరుణం ఇది. ఇటువంటి సమయంలో దేశ సమగ్రతకు, భద్రతకు, ప్రగతికి సమైక్యంగా కృషి చేసేందుకు ఈ సందర్భంగా సంకల్పిద్దాం'' అని సీఎం చంద్రబాబు అన్నారు.
విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇండిపెండెన్స్ డే పరేడ్‌లో వివిధ బెటాలియన్లు పాల్గొన్నాయి. స్డేడియానికి విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సీఎం చంద్రబాబు వెహికల్‌పై నుంచి అందరికీ అభివాదం చేస్తూ స్టేడియంలో తిరిగారు. ఈ వేడుకల్లో వివిధ శకటాల ప్రదర్శన, పరేడ్ ఆకట్టుకున్నాయి.