ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఊరటనిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By - అంజి |
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఊరటనిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ.7,358 కోట్ల మేర పెండింగ్ బిల్లుల విడుదలకు చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వం నుంచి పేరుకుపోయిన ఈ బకాయిలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేలా గతంలో తాను ఇచ్చిన ఆదేశాల అమలుపై అధికారులను ఆరా తీశారు.
ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటికే ప్రావిడెంట్ ఫండ్ (PF) బకాయిల కింద రూ.1,848 కోట్లను నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేశారు. అలాగే గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ (GLI) కింద 4,793 మందికి సంబంధించి రూ.76 కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయి. వీటితో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి గ్రాట్యుటీ బకాయిల కింద రూ.3,411 కోట్లు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కింద రూ.1,800 కోట్లు, పోలీస్ శాఖకు సంబంధించి అదనపు సరెండర్ లీవుల నిమిత్తం రూ.223 కోట్ల బిల్లుల విడుదల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.
మరో రెండు రోజుల్లో ఈ చెల్లింపులన్నీ పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 'తల్లికి వందనం' పథకం తర్వాత ఇంత భారీ స్థాయిలో నిధుల విడుదల కేవలం ఉద్యోగుల కోసమే జరుగుతోందని వారు పేర్కొన్నారు. ఇదే క్రమంలో చిన్న కాంట్రాక్టర్లకు, మెటీరియల్ సరఫరా చేసిన వారికి కూడా రూ.614 కోట్ల బకాయిలు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. బిల్లుల చెల్లింపు ప్రక్రియలో చిన్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.