ఏపీ సర్కార్ ఉగాది కానుక.. నేడు వారి బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు
ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కోసం తమ భూములను త్యాగం చేసిన నిర్వాసిత కుటుంబాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
By - అంజి |
ఏపీ సర్కార్ ఉగాది కానుక.. నేడు వారి బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు
ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కోసం తమ భూములను త్యాగం చేసిన నిర్వాసిత కుటుంబాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీపి కబురు అందించారు. రాబోయే ఉగాది పండుగను పురస్కరించుకుని, భూసేకరణ మరియు సహాయ పునరావాస (R&R) ప్యాకేజీ కింద బుధవారం నాడు సుమారు రూ.250 కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో సీఎం కొందరు నిర్వాసితులకు లాంఛనంగా చెక్కులను పంపిణీ చేసి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు.
ఈ కీలక కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) జి.సాయిప్రసాద్, ప్రభుత్వ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, జలవనరుల శాఖ ఈఎన్‌సీ (ENC) నరసింహమూర్తి తదితర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. పోలవరం నిర్వాసితుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, వారి పునరావాస ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడమే లక్ష్యమని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిర్వాసితుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా రూ.980 కోట్లు, దీపావళి పండుగ వేళ మరో రూ.1,000 కోట్లు నిర్వాసితులకు చెల్లించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో 2016లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే రూ.700 కోట్లు కేటాయించగా, దురదృష్టవశాత్తూ 2019-24 మధ్య వైఎస్ జగన్ పాలనలో నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా అందలేదని, ప్రస్తుత ప్రభుత్వం వారి కష్టాలను గుర్తించి ఈ ఆర్థిక సాయం అందిస్తోందని ప్రభుత్వం పేర్కొంది.