టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు.
By Srikanth Gundamalla Published on 28 Sept 2024 7:30 PM ISTటీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లిన ఆయన.. కార్యకర్తల నుంచి పలు వినతులను స్వీకరించారు. కాగా.. ప్రతి శనివారం చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వెళ్తున్న విషయం తెలిసిందే. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులను స్వీకరిస్తున్నారు. అలగే.. కార్యకర్తలు, నేతలతో సమావేశం అవుతుంటారు.
ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు శనివారం కూడా పార్టీ కార్యాలయానికి వెళ్లి.. అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. వైసీపీ నాయకులు ప్రభుత్వం, పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వారి విమర్శలను ఎదుర్కొని.. దీటుగా సమాధానాలు చెప్పాలని అన్నారు. ఏదైనా సమాచారం కావాలంటే సీఎం కార్యాలయంతో మాట్లాడి తీసుకోవాలని సూచించారు. సమన్వయంతో విపక్షం కుట్రలను తిప్పి కొట్టాలని అన్నారు సీఎం చంద్రబాబు. అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపైనా పార్టీ నేతలతో చంద్రబాబు చర్చించారు. అభ్యర్థుల ఎంపికపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఏపీ టీడీపీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు.
ఆ తర్వాత టీడీపీ పార్టీ ఆఫీసులోనే ప్రజల నుంచి సీఎం చంద్రబాబు అర్జీలు స్వీకరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వివిధ వర్గాల ప్రజలు, దివ్యాంగులు, విద్యార్థులతో పాటు సాయం కోసం వచ్చిన వారి నుంచి వినతులను తీసుకున్నారు. వారి బాధలను ఓపికగా విన్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వం తరుఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.