రాత్రంతా విజయవాడలోనే సీఎం చంద్రబాబు.. వరద బాధితులకు భరోసా
ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి.
By Srikanth Gundamalla
ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా విజయవాడలో గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని వర్షపాతం నమోదు అయ్యింది. విజయవాడ నగరం మొత్తం నీట మునిగింది. రహదారుల జలమయం అయ్యాయి. జనజీవనం స్తంభించి పోయింది.ఈ నేపథ్యంలో వరద బాధితులకు స్వయంగా సీఎం చంద్రబాబు అండగా నిలిచారు. అక్కడ సహాయక చర్యలను దగ్గరుండి చూసుకున్నారు. రాత్రంతా విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు అధికారులతో కలిసి పర్యటించారు. బోటులో తిరుగుతూ బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బుడమేరు వరదతో అస్తవ్యస్తమైన సింగ్ నగర్ ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు.. బాధితులకు అండగా ఉంటానని చెప్పారు. అర్ధరాత్రి ఒంటి గంటకు పైగా కృష్ణలంకలోని 16వ డివిజన్ పోలీసు కాలనీలో పర్యటించారు. రక్షణ గడ వద్ద వరద నీటిని పరిశీలించారు సీఎం చంద్రబాబు. సింగ్ నగర్, కృష్ణలంక, ఫెర్రీ, ఇబ్రహీంపట్నం, జూపూడి, మూలపాడు ప్రాంతాల్లో వరద ఉద్ధృతిని పరిశీలించారు.
అజిత్‌సింగ్ నగర్‌లో వరద నీటిలో చిక్కుకున్న బాధితులు తమ దుర్భర పరిస్థితిని చెప్పడంతో సీఎం చంద్రబాబు చలించిపోయారు. బాధితులకు కనీస సాయాన్ని అందించడంలో అధికారుల వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం లక్షమందికి వెంటనే ఆహారం అందించాలని ఆదేశించారు. విజయవాడలోని హోటళ్లలో అందుబాటులో ఉన్న ఆహారాన్ని బాధితుల కోసం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
విజయవాడలో ఇంతటి విపత్తు ఎప్పుడూ చూడలేదని సీఎం చంద్రబాబు అన్నారు. వరద నీటిలో చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటామన్నారు. ప్రాణరక్షణ కోసం ఇళ్లపైకి ఎక్కినవారికి ఒక్కటే భరోసా ఇస్తున్నానీ.. అవసరమైతే ఇక్కడికి మళ్లీ వస్తానని చెప్పారు సీఎం చంద్రబాబు. అందరినీ కాపాడేవరకూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా అన్నారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేరవేసేందుకు అదనపు పడవలు రప్పిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అలాగే బాధితులకు నిత్యావసరాలు..మంచినీరు సరఫరా చేస్తామని చెప్పారు. ప్రజలు కూడా వరద సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దనీ.. అధికారులకు సహకరించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.