జగన్ ఢిల్లీ డ్రామాలు అందుకే: ఏపీ సీఎం చంద్రబాబు
వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు.
By Srikanth Gundamalla
జగన్ ఢిల్లీ డ్రామాలు అందుకే: ఏపీ సీఎం చంద్రబాబు
వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. అసెంబ్లీ సమావేశాల నుంచి పారిపోయేందుకే జగన్ ఢిల్లీ డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం సందర్భంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. శ్వేతపత్రంలోని వాస్తవాలను ఎదుర్కోనే ధైర్యం జగన్‌కు లేదని చంద్రబాబు అన్నారు. జగన్ పెంచి పోషించిన గంజాయి, డ్రగ్స్ సంస్కృతి వల్లే అనర్థాలు జరిగాయని అన్నారు. వినుకొండ హత్య గంజాయి వల్ల జరిగినట్లు వైసీపీ నేతలు ఒప్పుకున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. శాంతిభద్రతల అంశంలో నేతలంతా క్రమశిక్షణ పాటించాలని అన్నారు. వైసీపీ అబద్ధపు విషప్రచారాన్ని సమర్ధంగా తిప్పికొడదామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఒకట్రెండు కార్పొరేషన్లకే జగన్ నిధులు మళ్లించారంటూ మండిపడ్డారు. ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్లిపోయారని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక రాష్ట్రాభివృద్ధిని సవాల్‌గా తీసుకుని పని చేద్దామని పిలుపునిచ్చారు.
వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం సందర్బంగా జగన్ ఎంపీలకు పలు సూచనలు చేశారు. శాంతిభద్రతల విషయంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని చెప్పారు. వినుకొండలో జరిగిన హత్యను చూస్తే... రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతుందని అన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలకు ఒక మెసేజ్ పంపడానికి చేసిన ప్రయత్నం ఈ హత్య అని చెప్పారు. ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలని సూచించారు జగన్. అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలుపుతామని చెప్పారు. మంగళవారం నాటికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఢిల్లీకి వస్తారని... బుధవారం ఢిల్లీలో నిరసన తెలుపుదామని జగన్ అన్నారు. ఎంపీలంతా వెంటనే ఢిల్లీకి వెళ్లే పనిలో ఉండాలని వైసీపీ అధినేత జగన్ సూచించారు.