అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరణ.. విశేషాలు ఇవే
తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని, అమరావతిలో ఆయన భారీ విగ్రహాన్ని...
By - అంజి |
అమరజీవి విగ్రహం ఆవిష్కరణ.. విశేషాలు ఇవే
తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని, అమరావతిలో ఆయన భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం ఘనంగా ఆవిష్కరించారు. అమరావతిలోని శాఖమూరు పార్కులో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం తెలుగు ప్రజల త్యాగానికి గుర్తుగా నిలవనుంది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన 58 రోజుల నిరాహార దీక్షకు ప్రతీకగా ఈ విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తులో నిర్మించడం విశేషం. దీనికి ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’ (త్యాగమూర్తి విగ్రహం) అని నామకరణం చేశారు.
సుమారు 6.80 ఎకరాల విస్తీర్ణంలో రూ.150 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేసిన స్మృతివనం ప్రాజెక్టులో భాగంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కేవలం ఆరు నెలల రికార్డు సమయంలోనే దీని నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఈ భారీ విగ్రహం తయారీ కోసం 26 టన్నుల కాంస్యం (బ్రాంజ్), 42 టన్నుల ఐరన్‌ను వినియోగించారు. మొదటి దశలో భాగంగా విగ్రహావిష్కరణ పూర్తి కాగా, రెండో దశలో ఇక్కడ అత్యాధునిక మ్యూజియం, ఫోటో గ్యాలరీ, ఆడిటోరియం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఈ కార్యక్రమం ముగించుకున్న అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంత్రం విజయవాడకు చేరుకోనున్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. అమరజీవి స్మృతివనం భవిష్యత్తులో అమరావతిలో ఒక ప్రధాన పర్యాటక మరియు చారిత్రక కేంద్రంగా వెలుగొందనుంది.