ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఖాజాలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. న్యాయాధికారుల శిక్షణ కోసం జ్యుడీషియల్ అకాడమీని ఏర్పాటు చేశారు. న్యాయమూర్తులు నిత్య నూతన విద్యార్థులుగా ఉంటూ నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని చంద్రచూడ్ అన్నారు.
అనంతరం సీజేఐ చంద్రచూడ్ మీడియాతో మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థలో టెక్నాలజీ వినియోగం పెరిగిందన్నారు. "సాంకేతికతను స్వీకరించడానికి మేము డిజిటలైజేషన్ ప్రక్రియను ప్రారంభించాము. సాంకేతికతకు అనుగుణంగా మార్పులు చేయాలి. కేసుల సత్వర పరిష్కారానికి సాంకేతికత ఉపయోగపడుతుంది'' అని అన్నారు. కోర్టులు వివాదాలను పరిష్కరించడంతో పాటు, న్యాయాన్ని నిలబెట్టేలా చూడాలని.. కేసుల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించాలని సూచించారు. న్యాయ వ్యవస్థను పరిరక్షించడానికి అందరి సహకారం అవసరమన్నారు.