చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వాహనాలు ఒకదానిని మరొకి ఢీకొన్నాయి. ఐదుగురు చనిపోయారు.

By Srikanth Gundamalla  Published on  8 Sep 2023 7:54 AM GMT
Chittoor, Road Accident, five Dead,

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

వడమాలపేట చెక్‌పోస్టు దగ్గర ఆగివున్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చెక్‌పోస్టు దగ్గర కొత్తగా నిర్మించిన నేషనల్ హైవేపై మార్కింగ్ కోసం రహదారుల నిర్మాణ సంస్థకు చెందిన మార్కింగ్ వాహనం నిలిపి ఉంచారు. రోడ్డు మార్జిన్లను గుర్తించే వైట్‌ పెయింటింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

వడమాలపేట దగ్గర హైవే పనులు జరుగుతున్నాయి. కార్మికులు తమ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి పనులు చేసుకుంటున్నారు. మితిమీరిన వేగంతో వచ్చిన ఒక లారీ.. పనుల కోసం నిలిపి వుంచిన లారీని ఢీకొట్టింది. దాంతో.. ఆ వాహనం రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఇక అదే మార్గంలో కారు వచ్చింది. వేగాన్ని అదుపు చేయలేక కారు కూడా లారీని ఢీకొట్టింది. కారు వేగంగా వస్తుండటంతో అందులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక కారు వచ్చిన మార్గంలోనే బైక్‌ కూడా ఈ వాహనాలను ఢీకొట్టింది. దాంతో.. బైక్‌పై వస్తున్న ముగ్గురు రోడ్డుపై పడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉందని తెలుస్తోంది.

వడమాలపేట చెక్‌పోస్టు దగ్గర క్షణాల్లో జరిగిపోయిన ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా.. మరో 8 మందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. నగరి సమీపంలో జాతీయ రహదారికి రేడియం మార్కింగ్‌ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోరానికి అతివేగమే కారణమని పోలీసులు, స్థానికులు చెబుతున్నారు. ఘటన జరిగిన ప్రదేశంలో నాలుగు వాహనాలు ఢీకొట్టుకోవడంతో భయానక వాతావరణం కనిపించింది. అయితే.. మృతిచెందిన వారిని మార్చురీకి తరలించగా.. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఇక వాహనాలు రోడ్డుపై పడిపోవడంతో కిలోమీటరు పొడవున ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. ఆ తర్వాత వాటిని క్లియర్ చేయడంతో వాహనాలు యథావిధిగా నడుస్తున్నాయి.

Next Story