ఏపీని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలో వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలువురు మృత్యువాత పడగా.. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా నేడు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడపకు చేరుకున్నారు. కడప విమానాశ్రయంలో చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘన సాగత్వం పలికాయి. అసెంబ్లీలో పరిణామాల తరువాత తొలిసారి ఆయన ప్రజా క్షేత్రంలోకి వస్తుండడంతో పార్టీ శ్రేణులు భారీగా వచ్చారు.
ఓపెన్ టాప్ వాహనంలో నిలబడి పార్టీ శ్రేణులకు చంద్రబాబు అభివాదం చేశారు. రాజంపేట, నందలూరు మండలాల్లో బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు వెళ్లారు. పులపతత్తూరు, మందపల్లి, తోగూరుపేట, గుండ్లూరు గ్రామాల్లో బాధితుల పరామర్శించి.. వారి సాధకబాధలను విననున్నారు. ఈ రోజు కడపలో పర్యటించనున్న చంద్రబాబు రేపు చిత్తూరు, ఎల్లుండి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.