క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
By Srikanth Gundamalla Published on 23 Sep 2023 8:11 AM GMTక్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. దాంతో.. స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టులో న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్‌ను క్వాష్ చేయాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరారు.
దర్యాప్తు తుది దశలో జోక్యం చేసుకోలేమంటూ క్వాష్ పిటీషన్‌ను హైకోర్టు తోసి పుచ్చింది. సెక్షన్ 482 కింద దాఖలైన వ్యాజ్యంలో మినీ ట్రయల్ నిర్వహించలేమని హైకోర్టు తెలిపింది. సీమెన్స్‌కు నిధుల విడుదలకు సిఫారసులతో నిధుల దుర్వినియోగమని హైకోర్టు పేర్కొంది. అస్పష్టమైన వ్యవహారమని, నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. 17(ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందని సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌లో చంద్రబాబు తరపు లాయర్లు పేర్కొన్నారు. కాగా.. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించే అవకాశం ఉంది. ప్రస్తుతం చంద్రబాబుని సీఐడీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో విచారిస్తున్నారు. శనివారం, ఆదివారం రెండ్రోజుల పాటు చంద్రబాబుని ప్రశ్నించనున్నారు సీఐడీ అధికారులు.
మరోవైపు ఏపీ హైకోర్టులో చంద్రబాబుకి మరోసారి చుక్కెదురు అయ్యింది. చంద్రబాబుని విచారించేందుకు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను విచారించేందుకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు.