సోమవారం చంద్రబాబుకు కీలకం, బెయిల్‌ సహా కస్టడీపై తీర్పు

దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణలు, తీర్పులు సోమవారం వెలువడనున్నాయి.

By Srikanth Gundamalla  Published on  8 Oct 2023 12:49 PM IST
Chandrababu, Skill development case, Monday, Court,

 సోమవారం చంద్రబాబుకు కీలకం, బెయిల్‌ సహా కస్టడీపై తీర్పు

దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణలు, తీర్పులు సోమవారం వెలువడనున్నాయి. స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కీంకు సంబంధించి సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌పై సోమవారం(ఈ నెల 9న) విచారణ ఉంది. ఇదే కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టు సోమవారమే నిర్ణయాన్ని వెల్లడించనుంది. దీంతో పాటు మరోసారి 'పోలీసు కస్టడీ'కి కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై సైతం అక్టోబర్ 9వ తేదీనే ఏసీబీ కోర్టు తగిన ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ రెండు పిటిషన్లపై శుక్రవారం ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసిన విషయం తెలిసిందే.

హైకోర్టులోనూ చంద్రబాబుకు సంబంధించిన మూడు బెయిలు పిటిషన్లపై సోమవారం తీర్పులు వెల్లడికానున్నాయి. రాజధాని అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అంగళ్లు, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో బెయిలు కోసం చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ఇటీవల వాదనలు ముగియడంతో.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డి తీర్పులను రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూడు పిటిషన్లలో న్యాయమూర్తి సోమవారం (అక్టోబర్ 9వ తేదీన) నిర్ణయం వెల్లడించనున్నారు.

దాంతో.. టీడీపీ నాయకులు కోర్టు నుంచి ఎలాంటి తీర్పులు వస్తాయోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులోనే ఉన్నారు. ఆయన్ని బయటకు తీసుకొచ్చేందుకు చంద్రబాబు తరఫు లాయర్లు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బెయిల్‌ పిటిషన్లు సహా.. కస్టడీకి కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్లపై సోమవారమే తీర్పులు వెల్లడికానున్నాయి. దాంతో.. సోమవారం ఏం జరుగుతోందో అని ఉత్కంఠ కొనసాగుతోంది.

Next Story