నవంబర్ 1 వరకు చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించిన ఏసీబీ కోర్టు
స్కిల్ కేసులో చంద్రబాబు రిమాండ్‌ను నవంబర్ 1వ తేదీ వరకూ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 19 Oct 2023 2:45 PM ISTనవంబర్ 1 వరకు చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించిన ఏసీబీ కోర్టు
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో చంద్రబాబుకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు రిమాండ్‌ను మరోసారి పొడిగించింది ఏసీబీ కోర్టు. చంద్రబాబు రిమాండ్ గురువారంతో ముగిసింది. దాంతో.. పోలీసులు ఆయన్ని వర్చువల్‌గా ఏసీబీ కోర్టు ముందు హాజరుపర్చారు. స్కిల్ కేసులో చంద్రబాబు రిమాండ్‌ను నవంబర్ 1వ తేదీ వరకూ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యి నెలరోజులకు పైగానే అవుతోంది. ఈ క్రమంలో ఆయన్ని బయటకు తీసుకొచ్చేందుకు చంద్రబాబు తరఫు లాయర్లు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. మరో వైపు రాష్ట్రంలో చంద్రబాబుకి మద్దతుగా టీడీపీ నాయకులు ఆందోళనలు.. నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటు తెలంగాణలోని హైదరాబాద్‌లో కూడా నిరసనలు చేపడుతున్నారు.
కాగా.. ఇదే సమయంలో జైల్లో చంద్రబాబుకు భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ నాయకులు అంటే చంద్రబాబుని అంతమొందించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈక్రమంలో ఇదే భద్రత అంశాన్ని కోర్టు ముందు స్వయంగా చంద్రబాబు ప్రస్తావించారు. జైలులో తన సెక్యూరిటీ విషయంలో పలు అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు కోర్టుకు తెలిపారు. దాంతో స్పందించిన అనుమానాలుంటే రాత పూర్వకంగా ఇవ్వాలని ఆయనకు ఏసీబీ కోర్టు జడ్జి సూచించారు. చంద్రబాబు రాసే లేఖను తనకు అందివ్వాలని జైలు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్యంపై జడ్జి ఆరా తీశారు. ఆయన మెడికల్ రిపోర్టులను అందివ్వాలని ఆదేశించారు. అలాగే చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.