రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదల

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఎట్టకేలకు రాజమండ్రి జైలు నుంచి విడుదల అయ్యారు.

By Srikanth Gundamalla  Published on  31 Oct 2023 4:40 PM IST
chandrababu, released,  rajahmundry jail, tdp,

రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదల

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఎట్టకేలకు రాజమండ్రి జైలు నుంచి విడుదల అయ్యారు. మంగళవారం సాయంత్రం చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చారు. చంద్రబాబు విడుదల సందర్భంగా జైలు వద్దకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. చంద్రబాబుకి స్వాగతం పలికారు.

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీం కేసులో అరెస్ట్‌ అయ్యిన చంద్రబాబు రాజమండ్రి జైలులో ఇప్పటి వరకు ఉన్నారు. దాదాపు 53 రోజుల పాటు జైల్లోనే ఉండిపోయారు. ఆయన్ని బయటకు తీసుకొచ్చేందుకు చంద్రబాబు తరఫు న్యాయవాదులు తీవ్రంగా శ్రమించారు. ఏసీబీ కోర్టులో బెయిల్‌ కోసం మంజూరు చేయగా కొట్టివేసింది. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. అనారోగ్యం దృష్ట్యా మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోరారు. అయితే.. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. షరతుల మధ్య బెయిల్‌ మంజూరు చేసింది. నాలువారాల తర్వాత స్వతహాగా మళ్లీ హాజరుకావాలని సూచించింది.

చాలా రోజుల తర్వాత చంద్రబాబు జైలు నుంచి విడుదల అవ్వడంతో టీడీపీ నాయకులు, పార్టీ శ్రేణులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకుని చంద్రబాబుకు స్వాగతం పలికారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. నారా లోకేశ్‌, బ్రాహ్మణి, దేవాన్ష్‌, నందమూరి బాలకృష్ణ, టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌, కంభంపాటి రామ్మోహన్‌రావు, ఏలూరి సాంబశివరావు, టి.డి.జనార్దన్‌ తదితరులు జైలు వద్దకు విచ్చేశారు. 53 రోజులుగా జైలులో ఉన్న చంద్రబాబును చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి, తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు తరలివచ్చారు.

ఇక అభిమానులు, కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. కానీ.. వాటిని తోసుకుంటూ చంద్రబాబుని చూడాలని జైలు వద్దకు దూసుకు వచ్చారు. దాంతో.. జైలు వద్ద ఉద్వేగ వాతావరణం నెలకొంది. అంతేకాదు.. జైలు వద్ద జై టీడీపీ.. జై చంద్రబాబు నినాదాలతో అభిమానులు, కార్యకర్తలు హోరెత్తించారు.

Next Story