చంద్రబాబు దీక్ష ప్రారంభం
Chandrababu Naidu Deeksha started at TDP office.తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న
By తోట వంశీ కుమార్ Published on 21 Oct 2021 10:09 AM IST
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ ఆఫీసులపై వైసీపీ శ్రేణుల దాడులను నిరసిస్తూ ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన నిరసన దీక్ష గురువారం ఉదయం ప్రారంభమైంది. 'ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు' పేరుతో 36 గంటల పాటు ఈ దీక్ష కొనసాగనుంది. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో పగిలిన అద్దాలు, ఫర్నీచర్ మధ్యనే చంద్రబాబు దీక్ష ప్రారంభించారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన దీక్ష రేపు రాత్రి 8 గంటలకు ముగియనుంది. చంద్రబాబుతో పాటు టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్శింహులు పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడుతో పాటు తదితరనేతలు దీక్షలో కూర్చున్నారు.
దీక్షకు మద్దతుగా వివిధ జిల్లాల నుంచి టీడీపీ శ్రేణలు తరలివస్తున్నారు. ఇక దీక్షలో కరోనా నిబంధనలు పాటించాలని గుంటూరు అర్భన్ పోలీసులు నోటిసులు ఇచ్చిన నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీక్షకు వెళ్లకుండా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, పెదవేగి మండలాల్లోని టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్భంధం చేశారు.
గవర్నర్‌ను కలవనున్న నేతలు
గురువారం సాయంత్రం గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్‌ను టీడీపీ నేతలు కలనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ తదితరులు గవర్నర్‌తో భేటి కానున్నారు.